TG: మాదిగ సామాజికవర్గ మేధావులకు మంత్రి కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-15 16:09:12  IST  )

ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహాలన్నింటినీ తొలగించేందుకు మాదిగ సామాజికవర్గానికి చెందిన మేధావులు కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా విజ్ఞప్తి చేశారు.

TG: మాదిగ సామాజికవర్గ మేధావులకు మంత్రి కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహాలన్నింటినీ తొలగించేందుకు మాదిగ సామాజికవర్గానికి చెందిన మేధావులు కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా విజ్ఞప్తి చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఒక్కటే జాతి అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ సామాజికవర్గానికి చెందిన ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీటితో పాటు ఎస్సీ సబ్ ప్లాన్, భూ పరిరక్షణ చట్టాలు ద్వారా జాతి అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగ సామాజిక వర్గానికి 9.77 శాతం రిజర్వేషన్లు లభించునున్నాయని వెల్లడించారు. మాదిగ సామాజిక అనుబంధ కులాల్లోని చిన్న చిన్న జాతుల జనాభా అభివృద్ధికి దోహద పడాల్సిన గురుతర బాధ్యత మాదిగ సామాజిక మేధావులకు ఉన్నదన్నారు.

ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తామని శాసనసభలో గంట వ్యవధిలో ప్రకటన చేశారన్నారు. శాసనసభ ప్రకటన అనంతరం ఎస్సీ వర్గీకరణ పై మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్నారు. వర్గీకరణ అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఆకాంక్షించారు. ప్రముఖ సామాజికవేత్త విశారదన్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టిన ఘనత రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహాకు దక్కిందన్నారు. ముతయ్య, మాదిగ, మాదిగ అనుబంధం కులాల ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య మాదిగ, ప్రొఫెసర్ మల్లేశం, కొండేటి మల్లయ్య, ముంజగల విజయ్ కుమార్, బీమ్ రావు, మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ జ్యూడిషరీ సంస్థకు చెందిన న్యాయవాదులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story