- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌంట్‌డౌన్ స్టార్ట్: మంత్రి అజారుద్దీన్ సీటు ఉంటుందా? ఊడుతుందా?
మినిస్టర్ అజారుద్దీన్ పదవికి గండం ఏర్పడింది. ఈ నెలాఖరులోగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే పదవి ఊడటం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి అజారుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే కచ్చితంగా ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ కు ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుండడంతో.. ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని శాసనసభా నిపుణులు చెబుతున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అనేక చిక్కుముడులు
ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. ఇక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కానీ జెడ్పీ ఎన్నికలు ఇంకా జరగనందున.. అక్కడ ఓటర్లు లేరు. జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానున్నది. మరోవైపు గవర్నర్ కోటాలోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం నవంబరులో ముగియనున్నది. ఆ మూడు ఖాళీల్లో ఒక స్థానానికి అజారుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఈనెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్లీ మే 1 నుంచి మంత్రి పదవిని చేపట్టినా కూడా.. మళ్లీ ఆరునెలల్లోగా.. అంటే అక్టోబర్ లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది.
గవర్నర్ నిర్ణయమే కీలకం
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమిర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హాయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమిర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి.. మళ్లీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండటంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ లోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో.. ఆ సమయంలో అజారుద్దీన్ ను మంత్రిగా నియమించారు. దీంతో ఆయన ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి అనివార్యత ఏర్పడింది. అయితే కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీల వ్యవహారంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినట్లు శాసనసభా నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కావని చెప్పినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కోదండరాం, అజారుద్దీన్ ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నదని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్ కోటా ఎంపికకు రాష్ట్ర కేబినెట్ మళ్లీ తీర్మానాన్ని చేస్తుందా? లేక గతంలో కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించమని గవర్నర్ ను ప్రభుత్వం కోరుతుందా? అనే అంశం ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ నెల 30 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేలిస్తే.. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఈ నెలలోనే తేల్చాల్సిన పరిస్థితులు నెలకొనడంతో రాజకీయంగా ఈ అంశం ఉత్కంఠకు గురి చేస్తున్నది.






