- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adluri Laxman: ఇందిరా గాంధీ అంటే ఎమర్జెన్సీ కాదు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ఇందిరా గాంధీ అంటే కేవలం ఎమర్జెన్సీ కాదు.. అభివృద్ధి, దూరదృష్టి, దౌత్య నాయకత్వానికి ప్రతీకగా తన పాలనలో చూపారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇందిరా గాంధీ (Indira Gandhi) అంటే కేవలం ఎమర్జెన్సీ కాదు.. అభివృద్ధి, దూరదృష్టి, దౌత్య నాయకత్వానికి ప్రతీకగా తన పాలనలో చూపారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సచివాలయంలో తన ఛాంబర్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గరీబీ హటావో నినాదంతో సామాజిక న్యాయ పోరాటానికి చిహ్నమైన నాయకురాలని అన్నారు. 20 సూత్రాల కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలనకు మార్గదర్శకులని అభివర్ణించారు. మహిళా సాధికారత, తాగునీరు, ఆరోగ్యం, చిన్నారుల పోషణ, ఎస్సీ, ఎస్టీ న్యాయం, అన్నీ ఇందిరమ్మ దృష్టిలో భాగమనీ పేర్కొన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించి, ఆత్మనిర్భర భారత్‌కు పునాది వేసిన దార్శనికురాలు అని కొనియాడారు. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిలో భారత్‌కి కొత్త దిశ చూపిన విజనరీ నాయకురాలు అని అన్నారు. అప్పటి వరకు ధనవంతులకే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి పేద రైతు తలుపు తట్టిన నేత అని అన్నారు.
ప్రస్తుత యువతరం ఇందిరాగాంధీని సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాలని అదే నిజమైన గౌరవం అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సామాన్యుడి కేంద్రంగా మార్చిన ధైర్యవంతురాలు అని, ప్రపంచ రాజకీయాల్లో అలీన దేశాలకు నాయకత్వం వహించిన మహిళా నేత అని చెప్పుకొచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో తటస్థ విధానంతో భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినది ఇందిరమ్మ అని అన్నారు. దూరదృష్టి కలిగిన దౌత్య నిపుణురాలు.. నేటికీ ఆమె మార్గం విదేశాంగ విధానానికి ఆదర్శమన్నారు. 1971లో అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి విజయం సాధించిన ఘనత ఆమెదన్నారు. 93,000 పాకిస్తాన్ సైనికులను లొంగదీసిన ఇనుమడిగిన రాజకీయ చాతుర్యం ప్రదర్శించిన గొప్ప నాయకురాలు అని అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షతో దేశాన్ని అణుశక్తి దేశాల సరసన నిలిపిన సాహస మహిళా అని, ఆర్యభట్ట ఉపగ్రహం ప్రారంభం ద్వారా అంతరిక్ష యుగంలోకి భారత్‌ను తీసుకువెళ్లిన దూరదృష్టి నాయకురాలు ఇందిరమ్మ అని కొనియాడారు.






