రూ.60 కోట్లు విడుదల.. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య స్థితిపై డిజిటల్‌ వ్యవస్థ: మంత్రి అడ్లూరి

by Ramesh Naini |

గురుకులాల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ తెలిపారు.

రూ.60 కోట్లు విడుదల.. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య స్థితిపై డిజిటల్‌ వ్యవస్థ: మంత్రి అడ్లూరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : (Gurukulas) గురుకులాల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారని, హాస్టళ్లలో ఆహార నాణ్యత, మెడికల్ చెక్‌ప్‌లు, సానిటేషన్‌పై ప్రత్యేక పర్యవేక్షణ, ప్రతి వారం ఇన్‌స్పెక్షన్‌లు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపే విధంగా చర్యలు చేపట్టామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ​కుమార్​ (minister adluri laxman kumar) తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిని డిజిటల్‌గా మానిటర్ (Digital monitor system) చేసే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతుందని, సీఎం దూరదృష్టితో గురుకులాల్లో అత్యవసర ఇబ్బందుల పరిష్కారం కోసం రూ.60 కోట్లు అత్యవసర నిధులు విడుదల చేశారన్నారు. శనివారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్​కుమార్ మాట్లాడుతూ.. సీఎం విడుదల చేసిన నిధులతో హాస్టళ్లలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం సాధ్యమవుతుందని, పెండింగ్ లో ఉన్న బకాయిలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో ఈ నెల 20 లోపు, మిగిలిన బిల్లులు ఈ నెల చివరిలోగా క్లియర్ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలకు కలిపి నిధులు కేటాయించడం సీఎం అంకితభావానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సొసైటీ స్థాయిలో పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్ల సమన్వయంతో సొసైటీ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. స్పీడ్ రెస్పాన్స్– ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటుతో ప్రతి సొసైటీ సెక్రటరీకి నిధుల వినియోగంపై పూర్తి అధికారం ఇచ్చారని, తాము అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులు 71,044 సంఖ్య పెరిగిందని, 3,931 మంది అదనంగా చేరారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో మొత్తం 3.27 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని అడ్లూరి లక్ష్మణ్​కుమార్​చెప్పారు.

ఎస్సీ గురుకులాల అభివృద్ధి..

ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌లో 62,334 మంది, డిగ్రీలో 8,710 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచడంతో ప్రభుత్వానికి అదనంగా రూ.46,438.84 లక్షలు భారం పడుతుందని మంత్రి తెలిపారు. మెస్ చార్జీల భారం రూ.39,520.24 లక్షలు, కాస్మెటిక్ ఛార్జీల భారం రూ.6,918.60 లక్షలు సంక్షేమంపై ఎంత భారం పడినా ఆ కుటుంబాలకు భరోసా, అండగా నిలుస్తున్నామని మంత్రి లక్ష్మణ్​కుమార్​చెప్పారు.

చిల్లర రాజకీయాలతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు

బీఆర్ఎస్ హయాంలో శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని, తాము వచ్చాక బాచుపల్లి, గొల్లపల్లి (జగిత్యాల) ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. విద్యార్థుల భోజనం, వసతి, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆహారం నాణ్యతలేమిపై రాత్రంతా మెస్‌లో జాగారం చేశారని, అప్పుడు ఒక్క మంత్రి కూడా అక్కడకు వెళ్లలేదని మంత్రి విమర్శించారు. వారు ఇప్పుడు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మంత్రి మండిపడ్డారు. మేమే రాజులం, మేమే మంత్రులం అంటూ దశాబ్దం పాటు వారు ఈ రెండు శాఖలను పూర్తిగా విస్మరించారు అని మంత్రి మండిపడ్డారు.

సివిల్ సర్వీసుల్లో గురుకులాల ప్రతిభ

2024 సివిల్స్ ప్రిలిమ్స్‌లో 24 మంది, మెయిన్స్‌లో 3 మంది సెలక్ట్ అయ్యారని మంత్రి చెప్పారు. 2025 లో 26 మంది విద్యార్థులు సివిల్స్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యారన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ప్రిలిమినరీలో 5 మంది విద్యార్థులు విజయం సాధించారన్నారు. గ్రూప్–1 (2024–25): 33 మంది, గ్రూప్–4: 145 మంది, DSC: 123 మంది, మొత్తం 186 మంది రాష్ట్ర–కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి లక్ష్మణ్​కుమార్​చెప్పారు. మీ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ మేనేజ్మెంట్ లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Next Story