స్కూల్ పిల్లల విషయంలో రాజకీయం చేయకండి ప్లీజ్.. విపక్షాలకు మంత్రి అడ్లూరి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

స్కూల్స్(Schools), పిల్లల విషయంలో దయచేసి రాజకీయం చేయకండి అని ప్రతిపక్షాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman Kumar) విజ్ఞప్తి చేశారు.

స్కూల్ పిల్లల విషయంలో రాజకీయం చేయకండి ప్లీజ్.. విపక్షాలకు మంత్రి అడ్లూరి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్స్(Schools), పిల్లల విషయంలో దయచేసి రాజకీయం చేయకండి అని ప్రతిపక్షాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman Kumar) విజ్ఞప్తి చేశారు. వీలైతే సలహాలు, సూచనలు ఇవ్వండి అని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో పెండింగ్ ఉన్న రూ. 11 కోట్లు తాము విడుదల చేశామని అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులను విస్మరించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళగానే ప్రత్యేకంగా స్పెషల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్‌‌ను నియమించారని తెలిపారు. టీజీటబ్ల్యుఆర్ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్‌టైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్‌, హెడ్‌ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ ఛార్జీలు విడుదల చేసినట్లు తెలిపారు.

కాంట్రాక్టు/ఔట్‌సోర్స్/పార్ట్‌టైమ్ సిబ్బందికి రూ.11.53 కోట్లు, సబ్జెక్ట్ అసోసియేట్స్‌, సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్‌లు మొదలైన వారికి రూ.2.38 కోట్లు, హెడ్‌ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి రూ.0.22 కోట్లు, స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు రూ.1.04 కోట్లు, రూ.9 కోట్లు చేసినట్లు చెప్పారు. 18 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభం అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్ కట్టుకోవడానికి నిధులు ఉన్నాయి కానీ.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించటం కాకుండా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మా ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నారు. అంతేకాదు.. ఏనాడూ మాజీ సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో భోజనం చేసింది లేదు. కానీ.. మా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారని గుర్తుచేశారు.

గ్రూప్-1 నియామకాల విషయంలో విషయంలో బట్ట కాల్చి మీదేయడం సరికాదు.. ఆధారాలు ఉంటే నిరూపించాలి, బయటపెట్టాలని విపక్షాలకు సవాల్ చేశారు. ‘పిల్లల భవిష్యత్తు విషయంలో మేము ఎప్పుడూ తప్పు చేయం. అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణ దశలో ఉన్నాయి’ అని అన్నారు.

Next Story