ఆశ్రమ పాఠశాల బాలికను నిమ్స్‌లో పరామర్శించిన మంత్రి

by Ajay Maddhiboyina |

నిర్మల్​జిల్లా కుంటాల మండలం నేరడిగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆత్రం త్రివేణి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్​లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరింది.

ఆశ్రమ పాఠశాల బాలికను నిమ్స్‌లో పరామర్శించిన మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్​జిల్లా కుంటాల మండలం నేరడిగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆత్రం త్రివేణి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్​లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం హుటాహుటిన నిమ్స్​ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి అమ్మాయి తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ హైదరాబాద్​లో నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో నిరంతరం అవసరమైన అన్ని పరీక్షలు చేస్తూ మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

ఆమెతో పాటు తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ కూడా ఉన్నారని వివరించారు. ఆత్రం త్రివేణికి వైద్యం అందిస్తున్న డాక్టర్ల బృందంతో మాట్లాడిన మంత్రి లక్ష్మణ్​కుమార్​ అవసరమైన అన్ని చికిత్సలు చేసి అమ్మాయి ఆరోగ్యాన్ని మెరుగు పరచాలని కోరారు. తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం వైద్య ఖర్చుకు వెనుకాడదని, అమ్మాయి ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి అడ్లూరి లక్షణ్​వెంట గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ. శరత్, అదనపు సంచాలకులు వి. సర్వేశ్వర రెడ్డి, ఉప సంచాలకులు దిలీప్ లు కూడా వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులకు ఆరోగ్య పరంగా భరోసా ఇచ్చారు.

ఈ వేసవి సెలవుల సమయంలో త్రివేణి తలపై కర్ర పడటంతో గాయమైంది. ఆమెను స్థానిక ఆర్ఎంపి వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తాత్కాలికంగా వైద్యం చేసుకున్నారు. కాగా గత నెల 20న పాఠశాలలు పునఃప్రవేశం చేసింది. ఈ నెల 11వ తేదీన ఆమె వాంతులు చేసుకోవడం, తీవ్రమైన తలనొప్పితో బాధపడింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుడు మెరుగైన చికిత్స కోసం ఆమెను పై ఆసుపత్రికి రిఫర్ చేశారు. హెడ్ మాస్టర్ , డిప్యూటీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ మరునాడు ఆమెను నిర్మల్ ప్రైవేట్ ఆసుపత్రి లో చేర్పించి సిటీ స్కాన్ రిపోర్ట్ ప్రకారం ఆమె మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు వైద్యులు తెలియజేశారు. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ నిమ్స్ లో చేర్చినట్లు అధికారులు మంత్రి కి వివరించారు.

Next Story