- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమ్యూనిస్టుల కంచుకోటను కాంగ్రెస్ వశం చేసిన ఘనత ఆయనదే: మంత్రి అడ్లూరి
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(Ramreddy Damodar Reddy) మృతిపట్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman) సంతాపం ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(Ramreddy Damodar Reddy) మృతిపట్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman) సంతాపం ప్రకటించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో దామోదర్ రెడ్డి స్వగృహంలో ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజలకు అంకితభావంతో సేవలందించిన దామోదర్‌రెడ్డి సూర్యాపేట, తుంగతుర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు. పల్లె సమస్యలనుంచి జిల్లా అభివృద్ధి వరకు ఆయన కృషి విశిష్టమని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు చేసిన కృషి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం నిస్వార్థంగా పోరాడిన త్యాగం చిరస్మరణీయమని మంత్రి స్మరించారు.
1985 నుండి 2009 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం ఆయన ప్రజాభిమానానికి నిదర్శనమని అన్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీశాఖ మంత్రిగా రాష్ట్రానికి నూతన దిశ చూపారని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులతోనూ, ప్రజలతోనూ సమాన హృదయంతో మెలగడం దామోదర్‌రెడ్డి విశిష్ట లక్షణమని, ఆయన నిష్కళంక స్వభావం, సాధుస్వభావం, ప్రజల పట్ల నిబద్ధత ఈ తరానికీ ఆదర్శమని మంత్రి అభిప్రాయపడ్డారు. దామోదర్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కూడా పెద్ద లోటు అని మంత్రి పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.
కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో బలోపేతం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాష్ట్రమంతా యూత్ కాంగ్రెస్‌కు ఆదర్శంగా నిలిచి యువతను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. మొట్టమొదటిసారిగా ఆయన ప్రస్థానం తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా మొదలైందన్నారు.






