- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రైతులకు అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 23న రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో మొదట ప్రవేశించిన రుతుపవనాలు జూన్ 1లోగా రాష్ట్రమంతటా ప్రవేశించాయి. అయితే రైతులను మాత్రం ఊరించి ఉసూరుమనిపించేలా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు, దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, దక్షిణ మధ్యప్రదేశ్‌ల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉన్న అల్పపీడన ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. ఈ మార్పు కారణంగా రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ఊసేలేని అల్పపీడనాలు
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కొద్ది రోజులుగా ఈ ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షాలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు, ప్రజలు ఈ వాతావరణ మార్పులను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. రుతుపవనాల సమయంలో అల్పపీడనాలు ఏర్పడటం సర్వ సాధారణమని, కానీ నెల రోజుల నుంచి ఇవి ఏర్పడకపోవడంతోనే వానలపై ప్రభావం పడుతోందని తెలిపింది.
281 మండలాల్లో సాధారణ వర్షపాతం
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 281 మండలాల్లో సాధారణ వర్షపాతం, 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం మహబూబాబాద్ జిల్లా గూడురు వర్గల్‌లో 3 సెం.మీ వర్షం, ఖమ్మం జిల్లా కూసుమంచిలో 3 సెం.మీ, నిజామాబాద్ జిల్లా ఎడపల్లెలో 2 సెం.మీ వర్షం కురిసిందని పేర్కొంది. ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.






