మెస్సీ vs సీఎం.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఖర్చు రూ.50 లక్షలు మాత్రమే! తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

by Ramesh Naini |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ మధ్య జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌ RR9 vs Messi10 కోసం రూ. 100 కోట్లు కేటాయించిందన్న వార్త పూర్తిగా అసత్య అని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

మెస్సీ vs సీఎం.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఖర్చు రూ.50 లక్షలు మాత్రమే! తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ మధ్య జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌ RR9 vs Messi10 కోసం రూ. 100 కోట్లు కేటాయించిందన్న వార్త పూర్తిగా అసత్య అని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ @FactCheck_TG గురువారం ఎక్స్ అధికారిక ఖాతా వేదిక వివరాలు తెలియజేసింది. ప్రచారంలో ఉన్న ఫేక్‌ వార్తలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని శుభ్రపరచడం, మరమ్మతులు చేయడానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే అధికారిక వర్గాల ప్రకారం, ఈ ఈవెంట్ కోసం స్టేడియం అధికారులు ఖర్చు చేస్తున్న మొత్తం రూ.50 లక్షలు మాత్రమే అని తెలిపింది. మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న అబద్ధపు వార్తలు అని పేర్కొంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 13 హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్లో జరగనుందని వివరించింది. స్టేడియం మౌలిక వసతుల పునరుద్ధరణలో భాగంగా, కుర్చీలు, లైటింగ్, షెడ్లు, బాత్రూములు మొదలైన వాటి మరమ్మతులు అలాగే మ్యాచ్‌కు హాజరయ్యే 38,000 మంది ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించే పనుల కోసం రూ.50 లక్షలు కేటాయించిందని వివరించారు.

“ప్రభుత్వం తరఫున ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్టేడియం వరకు గ్రీన్ ఛానల్‌, భద్రతా ఏర్పాట్లు మొదలైన వాటిని రాచకొండ పోలీసులు చూస్తున్నారు” అని యువజన పురోగతి, పర్యాటక & సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. కానీ, మ్యాచ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని చెబుతున్న వార్త పూర్తిగా అసత్యం అని మరోసారి నొక్కి చెప్పింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (RGI) క్రికెట్ స్టేడియం, RR9, Messi10 ల మధ్య జరగనున్న ఈ ఆసక్తికరమైన మ్యాచ్‌ను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధమైందని పేర్కొంది. RGI స్టేడియం 59 కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో 38,000 మంది ప్రేక్షకులను ఆతిథ్యం ఇవ్వగలదు.. ఈ స్టేడియం ఇప్పటికే అనేక క్రికెట్ లీగ్‌లు, మ్యాచ్‌లు కూడా నిర్వహించిందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ ద్వారా తెలిపింది. ట్వీట్ ఇదే..

Next Story