హైదరాబాద్‌లో మెస్సీ వైబ్.. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట..

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో మెస్సీ వైబ్.. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట..

హైదరాబాద్‌లో మెస్సీ వైబ్.. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట..
X

దిశ, తెలంగాణ బ్యూరో: లియోనెల్ మెస్సీ.. ఈ ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం పేరు ప్రస్తుతం తెలంగాణలో ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. సాకర్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్‌లో స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీంతో అతడి ఆటను చూసేందుకు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌లో మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి సైతం ఆడనుండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ గేమ్‌కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేంత స్టామినా కలిగిన సీఎం ఇటీవల కాలంలో దేశంలోనే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మెస్సీ, రేవంత్ రెడ్డి‌ల గేమ్‌ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. ఇటు క్రీడాకారులు, ఆటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మెస్సీ పర్యటన ఇలా..

మెస్సీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా చేరుకుంటారు. అక్కడ ఫ్యాన్స్‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. రూ.10 లక్షలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వందమంది ఫ్యాన్స్‌తో ముచ్చటించి వారితో ఫొటో దిగుతారు. సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకొని చిన్నారుల ఫుట్‌బాల్ టీంతో ముచ్చటిస్తారు. 15 నిమిషాల పాటు వారికి మెళకువలు నేర్పిస్తారు. 7.30 తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో చివరి ఐదు నిమిషాలు రేవంత్ రెడ్డితో కలిసి ఆడనున్నారు. మెస్సీతో పాటు అతడి సహచర ప్లేయర్స్ రోడ్రిగో, లూయిస్ సురేజ్‌లు సైతం గేమ్‌లో పాల్గొనున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ ఫలక్‌నుమా వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం ముంబైకి పయనమవుతారు.

రాహుల్ గాంధీ టూర్ ఇలా..

మ్యాచ్ చూసేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. నేడు సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్​చేరుకొని నేరుగా ఫలక్‌నుమా ఫ్యాలెస్ కు వెళ్లి మెస్సీతో ముచ్చిటించనున్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రాత్రి 10.30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరుతారు.

స్టేడియం దగ్గర పాస్‌లు అమ్మరు: సీపీ సుధీర్‌బాబు

ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు 3వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు.. మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మెస్సీకి జెడ్ కేటగిరి భద్రత కల్పించినట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మెస్సీ రూట్ మ్యాప్‌కు ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి పాసుల అమ్మకాలు ఉండవని.. అన్ని ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తారని.. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్క్ చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.

Next Story