T BJP: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. ఈ తేదీల్లో ఎప్పుడైనా జరగొచ్చు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

by Prasad Jukanti |

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

T BJP: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. ఈ తేదీల్లో ఎప్పుడైనా జరగొచ్చు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం (BRS Congress Merger) కాబోతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని ఇది తప్పక జరగబోతున్నదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న హరీశ్ రావు ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలోనూ పని చేస్తానని చెబుతున్నారని ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య విలీనం, అధికార మార్పిడే మిగిలి ఉందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కవితకు న్యాయసలహా అందిస్తున్న ప్రముఖ న్యాయవాదిని కాంగ్రెస్ ఇప్పటికే చట్టసభల్లో కూర్చోబెట్టిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, తాను మాట నిలబెట్టుకోవాల్సి ఉందని కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో అన్నారన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోని నిర్ణయాలపై విచారణ మందకొడిగా సాగుతోందన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుతో నిజమైన పేదలకు అన్యాయం:

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుత కాంగ్రెస్ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో జరగకపోవడం లేదని దీంతో ద్వారా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు చేరడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని అతితక్కువ సమయంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో, ప్రపంచంలో పాక్ ను ఏకాకిని చేయడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఓ వైపు ప్రపంచ దేశాలు భారత్ కు బాసటగా నిలుస్తుంటే మరో వైపు భారత్ దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్టు పార్టీలు తీర్మానం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.

Next Story