ఫ్యూచర్ సిటీకి మెగాస్టార్ చిరంజీవి.. సీఎం, మంత్రులతో భేటీ

by Ramesh Naini |

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఫ్యూచర్ సిటీకి మెగాస్టార్ చిరంజీవి.. సీఎం, మంత్రులతో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025” సదస్సు సందర్భంగా ఆయన మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీకి వచ్చారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. కాగా, గ్లోబల్ సమ్మిట్‌లో సినిమా రైజింగ్-2047 సెషన్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పలువురు సినీ నటులు, నిర్మాతలు హాజరయ్యారు. అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు రితేష్- జెనీలియా దంపతులు, అక్కినేని అమల, నటుడు రాహుల్ రవీంద్రన్ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Next Story