తెలంగాణలో మెగా గ్రోత్ కారిడార్: మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో పట్టణ కేంద్రిత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

తెలంగాణలో మెగా గ్రోత్ కారిడార్: మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతి ప్రాజెక్టును డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు (STPs), పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఈవీ వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కారిడార్ తెలంగాణకు అత్యంత కీలకంగా మారనుందని, ఈ మూడు కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లు ఉండేలా డిజైన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ శాఖ అధికారులతో ‘పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్’పై ఎంసీహెచ్ఆర్డీలోని బోది పెవిలియన్‌లో బుధవారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా పరిగణించాలని సూచించారు. సింగరేణి సంస్థకు చెందిన సీఎస్ఆర్ (CSR) నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో రాబోయే ఎయిర్ పోర్టులను దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ఖర్చు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే అయి ఉండాలని ఆదేశించారు.

అర్బన్ సెంట్రిక్ డెవెలప్‌మెంట్ ప్లానింగ్..

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో కూడిన అర్బన్ ప్లానింగ్ ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్లను నిర్మించాలని సూచించారు. ప్రతి చోట స్మార్ట్ పోల్స్ ఉండాలని, ఆయా నగరాల జనాభాకు తగినట్లుగా స్థానికంగా డిజైన్ చేసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వాడేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచించారు.

ప్రత్యేక కారిడార్లు..

రాష్ట్రంలో ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వరంగల్ - కరీంనగర్ - ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు వెన్నెముకగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ - యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ - నాగోబా - బాసర - కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, మహబూబ్ నగర్ - భూత్పూర్ - జడ్చర్ల ప్రాంతాలను కలిపి ఒక కారిడార్‌గా, కొత్తగూడెం - పాల్వంచ - సుజాతనగర్ కలిపి మరో కారిడార్‌గా రూపొందించాలని సూచించారు.

ఎయిర్ పోర్టుల రాకతో అభివృద్ధి..

ఎయిర్ పోర్టుల రాకతో వరంగల్ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని సీఎం అన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టుకు అవసరమైన నీటి అవసరాలను ఇప్పుడే అంచనా వేయాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును డిఫెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి, డీటీసీపీ డైరెక్టర్ ఎస్. దేవేందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ విభాగం ఈఎన్సీ ఎస్. భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Next Story