HYD: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు భేటీ

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు భేటీ అయ్యారు.

HYD: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, కార్యకలాపాల సమన్వయం, శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాలపై చర్చించారు. ఇరురాష్ట్రాల మధ్య సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా, మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అధ్యక్షులు మాధవ్ రావడంతో గర్వంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించి రాష్ర్టంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అనంతరం మాధవ్​ప్రసంగిస్తూ గతంలో తెలంగాణ బీజేపీ కార్యాలయం నిర్మాణం, గృహప్రవేశం వంటి పనుల్లో పాల్గొన్న అనుభవం తనకుందన్నారు.

పూర్వంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. ఆ సమయంలో ఈ కార్యాలయం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనలు ఇతర కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయానికి రావడం హోమ్ కమింగ్ అనుభవం ఇస్తోందన్నారు. రాంచందర్ రావు నియామకం కావడం మేం అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు రెండు కళ్లలాంటివి. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. తాము ఈ ప్రాంతంలో కూడా పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో పనిచేశామని, మా నాన్న, పీవీ చలపతి రావు, ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

వారికి ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక పనులు, పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాల్లో సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తామని, తెలుగు ప్రజల సంక్షేమం, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లతామన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగుతుంది. రాబోయే కాలంలో ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారంతో కృషి చేస్తామన్నారు.

Next Story