మెడికల్ కాలేజీల నిలువు దోపిడీ..వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఫీజులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. నాలుగున్నరేళ్లకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నాయి.

మెడికల్ కాలేజీల నిలువు దోపిడీ..వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మెజార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. నిబంధనలు గాలికి వదిలేసి బీ, సీ కేటగిరి (మేనేజ్ మెంట్ కోటా) విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేండ్లు మాత్రమే. దీనికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ), కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా.. యాజమాన్యాలు లెక్క చేయడం లేదు. పూర్తి ఐదేండ్ల ఫీజు చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ రూ.వందల కోట్ల దందాకు తెరలేపాయి. ప్రశ్నిస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బెదిరిస్తూ.. ఈ ఫీజుల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి.

ఏటా రూ.209 కోట్ల అదనపు భారం

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ-కేటగిరీలో 2,963 సీట్లు, సీ-కేటగిరీలో 872 సీట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం కోర్సు చివరి ఏడాది ఆరు నెలలకు మాత్రమే ఫీజు చెల్లించాలి. కానీ కాలేజీలు పూర్తి ఏడాది ఫీజును వసూలు చేస్తున్నాయి. బీ-కేటగిరీలో ఒక్కో విద్యార్థిపై రూ. 6 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు అదనపు భారం పడుతున్నది. సీ-కేటగిరీలో బీ కేటగిరీతో పోలిస్తే ఫీజులు రెట్టింపు ఉండటంతో, ఒక్కో విద్యార్థిపై రూ. 12 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు భారం పడుతున్నది. మొత్తంగా తల్లిదండ్రులపై ఏటా సుమారు రూ. 209 కోట్ల అదనపు భారం పడుతున్నదని అంచనా.

వర్సిటీ హెచ్చరికలూ డోంట్ కేర్

ఫీజుల దోపిడీపై తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఈ నెల 2న అన్ని ప్రైవేటు కాలేజీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఫీజును నాలుగున్నరేళ్లకు లెక్కించి, ఐదు వాయిదాల్లో మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉల్లంఘిస్తే అఫిలియేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అయినా ఎక్కువ మెడికల్ కాలేజీలు వర్సిటీ ఆదేశాలను లెక్కచేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీరే ఇందుకు నిదర్శనం. అధిక ఫీజులు వసూలు చేయొద్దంటూ వర్సిటీ లెటర్ పంపిన రెండు రోజులకే (ఏప్రిల్ 4న) సదరు కాలేజీ విద్యార్థులకు ఐదో ఏడాది ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు పంపడం గమనార్హం. పాత జీవోలను సాకుగా చూపిస్తూ ప్రస్తుత నిబంధనలను కాలేజీ యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి.

హాల్ టికెట్ల పేరిట వేధింపులు

ఫీజు కట్టకుంటే ఫైనల్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వబోమని కాలేజీలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పరీక్షల ముందు విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టనివ్వకుండా, హామీ పత్రాలు రాయించుకుని వేధిస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, విద్యార్థులపై పడుతున్న అదనపు ఫీజుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.

సుప్రీం కోర్టుకైనా వెళ్తాం

- మల్లోజు సత్యనారాయణ చారి, రాష్ట్ర అధ్యక్షుడు, మెడికో పేరెంట్స్ అసోసియేషన్

రాష్ట్రంలోని ఎక్కువ ప్రైవేటు మెడికల్ కాలేజీలు అదనపు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. ఏడాదికి రూ. 209 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేస్తున్న ప్రైవేటు మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వర్సిటీ ఆదేశాలు, ప్రభుత్వ జీవోలను లెక్కచేయని కాలేజీలపై అసోసియేషన్ తరఫున సుప్రీం కోర్టుకైనా వెళ్లి పేరెంట్స్ పై భారం పడకుండా చూస్తాం. ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసి అదనపు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం.

మొత్తం ఫీజు కట్టాల్సిందేనట్టు ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థికి పంపిన నోటీసు

అధిక ఫీజులు వసూలు చేయవద్దంటూ యూనివర్సిటీ ఆదేశాలు

Next Story