- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవో నెం.229పై వైద్యవర్గాల ఆగ్రహం!
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో జీవో 229 చిచ్చురేపింది. మెడికల్ కౌన్సిల్ (టీఎస్ ఎంసీ) స్వరూపాన్ని మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో జీవో 229 చిచ్చురేపింది. మెడికల్ కౌన్సిల్ (టీఎస్ ఎంసీ) స్వరూపాన్ని మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ జీవోతో ఎన్నికల్లో నెగ్గిన వైద్యులకు ఉన్న మెజారిటీ హక్కులు హరించబడే ప్రమాదం ఏర్పడనున్నది. కౌన్సిల్ ను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థను ‘కీలుబొమ్మ’ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్యవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులు తప్పుచేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా ఈ జీవో ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య రెట్టింపు..
మెడికల్ కౌన్సిల్ లో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వైద్యులదే పైచేయి ఉండేది. కానీ తాజా జీవో ప్రకారం కౌన్సిల్ లో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతంలో ఎన్నికైన సభ్యుల సంఖ్య 13 ఉండగా, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 12గాఉండేది. అంటే మెజారిటీ ఎన్నికైన వారిదే. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచారు. దీంతో మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య 16కు చేరనున్నది. కౌన్సిల్ మొత్తం బలం 29కి పెరిగినా.. అందులో ఎన్నికైన వారు 13 మందే కావడంతో వీరి సంఖ్య తగ్గనుంది. దీంతో కౌన్సిల్ నిర్ణయాలన్నీ ఇక నుంచి అధికారుల కన్నుసన్నల్లోనే జరిగే అవకాశాలున్నాయని, ఎన్నికైన సభ్యులకు ఎలాంటి విలువ ఉండదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల కౌన్సిల్ ఇకపై స్వతంత్రంగా వ్యవహరించకుండా.. ప్రభుత్వ నిర్ణయాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆరోపిస్తున్నారు.
నకిలీ వైద్యులపై దాడులు ఆగిపోయే అవకాశం
మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతున్నది. డీఎంహెచ్ఓలు చేయలేని పనిని కౌన్సిల్ లో ఎన్నికైన సభ్యులైన వైద్యులు చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు కౌన్సిల్ లో అధికారుల పెత్తనం పెరిగితే.. రాజకీయ ఒత్తిళ్లతో నకిలీ వైద్యులపై దాడులు ఆగిపోయే ప్రమాదముందని వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి. నకిలీలకు ఈ జీవో రక్షణ కవచంలా మారుతుందని పేర్కొంటున్నాయి. మరోవైపు తమకు గిట్టనివారిపై మాత్రమే దాడులు చేసే ప్రమాదం సైతం ఉందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ వైద్యులపై వరుస దాడులు జరుగుతుండడంతోనే ఎమ్మెల్యేలు, మంత్రులపై నుంచి ఒత్తిడి పెరిగిందని, ఫలితంగానే ఈ జీవో వచ్చిందనే వైద్యులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారా?
ఈ జీవో వెనక కొందరు అధికారుల హస్తముందని, వారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించారని వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయకుండానే గుట్టు చప్పుడు కాకుండా ఈ జీవోను జారీ చేశారని వైద్యులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కౌన్సిల్ ను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్
జీవో 229ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ సహా పలు వైద్యసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ప్రజాస్వామ్య దేశంలో ఇది నిరంకుశ పోకడ’ అని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జుడా) మండిపడింది ‘మెడికల్ కౌన్సిల్ స్వతంత్రంగా పనిచేసేలా చూడాలి’ అని సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మెడికల్ కౌన్సిల్ ను ప్రొఫెషనల్ గా ఉంచాలి. బ్యూరోక్రాట్ల పెత్తనం వద్దు’ అని ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్ వర్క్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని ఐఎంఏ తెలంగాణ యూనిట్ తెలిపింది. ఈ జీవోను సత్వరం ఉపసంహరించుకోవాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా. పి కిషన్, డా. వి అశోక్ డిమాండ్ చేశారు. హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ సహా రాష్ట్ర వైద్య సంఘాలే కాకుండా జిల్లాల్లోనూ ఎక్కడిక్కడ అన్ని వైద్య సంఘాలు, వైద్య విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కౌన్సిల్ లో బ్యూరోక్రాట్ల పెత్తనం వద్దని కోరుతున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నాయి.
కొత్తగా చేరిన సభ్యులు వీరే..
గతంలో కాళోజీ వర్సిటీ వీసీ, డీఎంఈ, డీహెచ్, టీవీవీవీ కమిషనర్ మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండేవారు. తాజా జీవోతో వీరితోపాటు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, ఆరోగ్యశ్రీ సీఈఓ, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్, నిమ్స్ డైరెక్టర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేరుతారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య పెరిగినా..ఎన్నికైన సభ్యుల బలం తగ్గిపోతుంది. విధాన నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు 15 మంది సభ్యుల మద్దతు సరిపోతుంది. అది ప్రభుత్వం నామినేట్ చేసిన వారి వద్దే ఉంటుంది. నామినేట్ అయిన వారంతా అధికారులు, ప్రభుత్వం చెప్పినట్లుగా వినేవారే కావడంతో ఆటోమేటిక్ గా ఎన్నికైన సభ్యుల పవర్ తగ్గిపోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. కౌన్సిల్‌లో వైద్యుల స్వతంత్ర నిర్ణయాలకు అవకాశం తగ్గి, ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.






