కంటోన్మెంట్‌ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : ఈటల

by Chintha Aamani |   (  Updated:2025-07-15 09:03:01  IST  )

కంటోన్మెంట్ ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

కంటోన్మెంట్‌ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : ఈటల
X

దిశ,కంటోన్మెంట్ : కంటోన్మెంట్ ను సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మురికి కూపంగా తయారైన రామన్న కుంట చెరువును ఆహ్లదకరంగా.. సేదతీరే విధంగా తయారు చేయబోతున్నట్లు వివరించారు. మంగళవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి సమావేశం బోర్డు అధ్యక్షుడు ,బ్రిగేడియర్ సంజీవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనగా, సీఈవో మధుకర్ నాయర్, జాయింట్ సీఈవో పల్లవీ, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ , చీఫ్ ఇంజనీర్ ఉమా శంకర్,వాటర్ వర్క్స్ సూపరింటిండెంట్ రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.

పార్కులు, ఓపెన్ జిమ్ములు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో మంచి ప్రణాళికతో సుందరమైన కంటోన్మెంట్ గా తయారు చేయబోతున్నాం. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడుతూ..రాజీవ్ రహదారి, నాగపూర్ హైవే ఫ్లైఓవర్ కింద పోయిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన ఉండటం వలన కంటోన్మెంట్ లో వర్షం వస్తే ఇళ్లలో పది అడుగులు నీరు చేరుతుందన్నారు. రూ. 303 కోట్లతో కంటోన్మెంట్ లో ఎక్కడ నీరు నిలవకుండా సివరేజ్, నాలాలతో బయటకు పంపించే విధంగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించనున్నట్లు తెలిపారు. సీతారామపురం ఏరియాలో అనేక కాలనీలు ఉన్నాయి. ఎప్పుడు వరదలు వచ్చిన మొట్టమొదటి ముంపుకు గురయ్యే ప్రాంతం. దానికి కూడా శాశ్వత పరిష్కారం చేయబోతున్నట్లు ఎంపీ వెల్లడించారు.

మురికి నీళ్లతో దుర్గంధపు వాసనతో రామన్న కుంట ఉందని, దాన్ని వాకింగ్ ట్రాక్ తో పచ్చని చెట్లతో ప్రజలు సెదదిరే విధంగా దాన్ని తీర్చిదిద్దబోతున్నామని వివరించారు.అదేవిధంగా లే అవుట్ లలో ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు అనుమతులు ఇవ్వాలని, వారిని ఇబ్బందులకు గురి చేయద్దన్నారు. కంటోన్మెంట్ పార్కులు, ఓపెన్ జిమ్ములు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో మంచి ప్రణాళికతో సుందరమైన కంటోన్మెంట్ గా తయారు చేయబోతున్నామని ఈటల రాజేందర్ తెలియజేశారు. మీడియా సమావేశంలో కంటోన్మెంట్ ఇన్ చార్జీ డాక్టర్ వంశ తిలక్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ లు పాల్గొన్నారు.

Next Story