కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల బెదిరింపు

by Malleboina Mahesh |

‘తాను కట్టుకుంటున్న ఇంటి నిర్మాణాన్ని ఫిర్యాదు ఉంది అంటూ కుత్బుల్లాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోతూ ఓ వృద్ధురాలు జిల్లా కోర్టును ఆశ్రయించింది.

కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల బెదిరింపు
X

దిశ, పేట్ బషీరాబాద్ : ‘తాను కట్టుకుంటున్న ఇంటి నిర్మాణాన్ని ఫిర్యాదు ఉంది అంటూ కుత్బుల్లాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోతూ ఓ వృద్ధురాలు జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి సీనియర్ సిటిజన్ అని ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ ‘ముందు కేసు వాపస్ తీసుకో’ తర్వాత నీ ఇంటి సంగతి చూస్తా అంటూ హుకుం జారీ చేశాడని, దీనికి వత్తాసుగా కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సైతం ఇదే రీతిలో మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు ఓ పార్టీ నాయకుడు ఒక భారీ అక్రమ నిర్మాణంపై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే దానికి సమాధానం ఇవ్వకపోగా ప్రశ్నించడానికి వచ్చిన నాయకుడిపై చెలరేగిపోవడంతో ఆ పంచాయతీ మంగళవారం డిప్యూటీ కమిషనర్ వద్దకు చేరింది.

డ్యూటీ అంటేనే బెదిరింపులా..?

కుత్బుల్లాపూర్ సర్కిల్ నందానగర్‌లో ఓ వృద్ధురాలికి 2015లో ప్రభుత్వం పట్టా జారీ చేసింది. ఆ స్థానంలో ఇంటి నిర్మించుకోవడానికి రెండు నెలల క్రితం పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పనులు ఆపేయడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై బాధితురాలు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం జిల్లా కోర్టును సైతం ఆశ్రయించింది. ఇదే క్రమంలో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఆ విషయం తెలుసుకోవడానికి వృద్ధురాలి తరుపున ఆమె కొడుకు (సీనియర్ సిటిజన్) డిప్యూటీ కమిషనర్‌ను కలవడానికి వెళ్లగా ఆయన మీరు మా పై కేసు వేస్తారా..? ముందు కేసు వాపస్ తీసుకొని రండి అంటూ చెప్పి పంపించేశారని బాధితులు వాపోయారు.

అనంతరం మరో మారు టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారిని కలవగా ఆయన మరింత గంభీరంగా ఇష్టారీతిగా మాట్లాడుతూ ముందు కేసు వాపస్ తీసుకో, తర్వాత నీ ఇంటి సంగతి మాట్లాడతా అంటూ హుకుం జారీ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా సర్కిల్ స్థాయిలో ఉన్నతాధికారి మొదలుకుని కిందిస్థాయి వరకు అందరూ బెదిరించటమే డ్యూటీగా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై సదరు సీనియర్ సిటిజన్ జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు తన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తే తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని బాధితులు చెబుతున్నారు.

డివిజన్ నాయకుడికి చేదు అనుభవం..

ఇప్పటి వరకు సామాన్యులు, ఫిర్యాదులుదారులపై బెదిరింపు ధోరణిగా వ్యవహరిస్తూ వచ్చిన కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు, మరొకమారు ఓ ప్రధాన పార్టీకి చెందిన డివిజన్ స్థాయి అధ్యక్షుడిపై ఇష్టారీతిన మాట్లాడుతూ వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. జీడిమెట్ల డివిజన్ ప్రాగ టూల్స్ కాలనీలో ఓ వ్యక్తి అనుమతులకు విరుద్ధంగా జీ ప్లస్ టు కమర్షియల్ నిర్మాణం చేపట్టడంపై పార్టీ నాయకుడు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఆర్టిఐ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంపై మాట్లాడటానికి మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మధును సదరు నాయకుడు ప్రశ్నించగా వారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దరఖాస్తులు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ సెక్షన్ అధికారి అవమానకరంగా మాట్లాడటంతో పంచాయతీ డిప్యూటీ కమిషనర్ వద్దకు చేరింది. అక్కడ కూడా ఇరువురు వాదోపవాదాలు చేసుకోవడం కనిపించింది. సదరు సెక్షన్ అధికారి మధు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డివిజన్ స్థాయి నాయకుడు ఫిర్యాదు చేశాడు.

విధులు నిర్వహిస్తే అక్రమ నిర్మాణాలు ఎలా..?

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆర్డర్స్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరులు ఇచ్చిన ఫిర్యాదులను లెక్కచేయరని, సమాచార హక్కు చట్టం ద్వారా ఇన్ఫర్మేషన్ కోరితే పొంతనలేని జవాబులు ఇవ్వడం చేస్తూ కాలయాపన చేయడం పరిపాటిగా మారిందని కుత్బుల్లాపూర్ టౌన్‌ప్లానింగ్ భాగంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీఓగా పనిచేస్తున్న అధికారికి కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అదనపు బాధ్యతలు ఉండటంతో ఇక్కడి సర్కిల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో పర్యవేక్షణ కొరవడింది.

దీంతో సెక్షన్ అధికారి, చైన్‌మెన్‌లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సరైన విధంగా విధులు నిర్వహిస్తే సర్కిల్ పరిధిలో ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి..? వారు విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ తరహా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story