మరమ్మత్తులు చేస్తుండగా కుప్పకూలిన భవనం..

by Disha Web Desk 11 |
మరమ్మత్తులు చేస్తుండగా కుప్పకూలిన భవనం..
X

దిశ, పేట్ బషీరాబాద్: చెదలు పట్టిన కిటికీలు, తలుపులకు మరమ్మత్తులు చేస్తుండగా పురాతన భవనం నేలమట్టమైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనీ రామాలయం సమీపంలో 30 సంవత్సరాల క్రితం నాటి జీ ప్లస్ టూ పురాతన భవనం ఉంది. ఈ భవనాన్ని అమ్మగా ఓ వ్యక్తి 15 రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. భవనంలో ఉన్న తలుపులు, కిటికీలకు చెదలు పట్టి శిథిలావస్థలో ఉండటంతో కొనుగోలు చేసిన వ్యక్తి గత ఐదు రోజుల నుంచి భవనానికి మరమ్మత్తులు చేయిస్తున్నాడు.

ఒకేసారి కిటికీలు, తలుపులు పెకిలించడంతోనేనా..?

కొత్తగా కొనుక్కున్న ఇంటికి చెదలు పట్టాయని మరమ్మత్తులు చేయించేందుకు యాజమాని భవనంలో ఉన్న కిటికీలు, తలుపులను తొలగించే పనిలో ఉన్నాడు. ఇందుకు గత ఐదు రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం భవనాన్ని లోపల వైబ్రేషన్స్ వచ్చి బీటల్ కనిపించాయి. అనుమానం వచ్చిన పనివారు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే కొద్దిసేపటికి భవనం నేలమట్టమయింది. భవనం లోపల ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాత భవనంలో ఉన్న కిటికీలు తలుపులు అన్నింటినీ పెకలించడం, పాత భవనం కావడంతో దానికి పిల్లర్లు, బీమ్ లు లేకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

బీటలు వారిన సమీప భవనాలు.. ఓ మహిళకు గాయాలు

భవనం కుప్పకూలడంతో దాన్ని శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండు భవనాలపై పడ్డాయి. ఆయా భవనాలకు కొద్ది మేర క్రాక్ లు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న తానాబాయి అనే మహిళ కాలుపై శిథిలాలు పడడంతో ఆమెను చింతల్ లో ఉన్న హరిత హాస్పిటల్ కు తరలించారు.


Next Story

Most Viewed