టెంపుల్ అల్వాల్ 420 గజాల స్థలం కబ్జా

by velandi.Saikiran |   (  Updated:2026-05-17 22:31:02  IST  )

అల్వాల్ మండలంలోని టెంపుల్ అల్వాల్ లో 3 ఎకరాల 20 గుంటల గ్రామ కంఠం భూమి ఉంది.

టెంపుల్ అల్వాల్ 420 గజాల స్థలం కబ్జా
X

గ్రామ‘కంఠం’ నొక్కేస్తున్నారు..!

టెంపుల్ అల్వాల్ 420 గజాల స్థలం కబ్జా

తప్పుడు పత్రాలంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు

సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

దిశ,మేడ్చల్ బ్యూరో: గ్రామ ‘కంఠం’ భూములను నొక్కేస్తున్నారు.ప్రభుత్వ(గ్రామ కంఠం) భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ,స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. కబ్జాదారులతో కుమ్మక్కైన మున్సిపల్ శాఖ గ్రామ కంఠం భూమిలో అనుమతులు జారీ చేసింది. వెరసి మేడ్చల్ జిల్లా, అల్వాల్ గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.కోట్ల విలువైన గ్రామ కంఠం భూములు అన్యా క్రాంతమవుతున్నాయి.

గ్రామ కంఠం హాంఫట్...

అల్వాల్ మండలంలోని టెంపుల్ అల్వాల్ లో 3 ఎకరాల 20 గుంటల గ్రామ కంఠం భూమి ఉంది. ఈ స్థలంలో పోలీస్ స్టేషన్,ఓపెన్ ల్యాండ్, రూమ్,శ్రీ వెంకటేశ్వర మహిళ మండలి భవనంతో పాటు ,ఇంకా మిగిలిన స్థలంలో పబ్లీక్ టాయిలెట్లు, సెప్టిక్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.మహిళ భవన్ లో 60 ఏళ్లుగా వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ..వస్తున్నారు. మిగిలిన 420 గజాల ఖాళీ స్థలాన్ని పక్కనే ఉన్న ఓ వ్యాపారి కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్ లో ఇక్కడ ఒక గజం స్థలానికి లక్ష రూపాయాల ధర పలుకుతుంది.అంటే దాదాపు రూ.4 కోట్లు విలువైన గ్రామ కంఠం భూమి కబ్జా అవుతుందన్న మాట.

గ్రామ కంఠంలో అక్రమ నిర్మాణం..

టెంపుల్ అల్వాలోని గ్రామ కంఠంకు (ఇంటి నెంబర్ 1-9-62/5) చెందిన 420 గజాల స్థలంలో మున్సిపల్ అధికారులు ఇంటినిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2026,జనవరి 13న (ఫైల్ నెం.036108/జీహెచ్ఎంసీ/09807/ఎల్ఏబిపీ/సీ2/2026) స్టిల్ట్ ప్లస్ 3 అంతస్థుల భవనానికి అనుమతులు జారీ అయ్యాయి.గ్రామ కంఠంలో అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై అనేక ఫిర్యాదులు వెళ్లాయి.దీంతో ఈ స్థలంపై మండల తాహసీల్దార్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ కోరగా, 2026,మార్చి 18వ తేదీన మండల తాహసీల్దార్ రాములు ఈ స్థలం గ్రామ కంఠం కు చెందిన స్థలమని నివేదిక అందజేశారు. మండల సర్వేయర్ గతంలో సర్వే చేసి గ్రామ కంఠం భూమిగా తేల్చినట్లు నివేదించారు.

అదేవిధంగా గ్రామ కంఠంలో నిర్మిస్తున్న భవనానికి అనుమతులు ఏలా ఇచ్చారని..? వాటికి సంబంధించిన డాక్యుమెంట్లతో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ అల్వాల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ నెల 4న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సాధారణంగా గ్రామ కంఠం భూములు స్థానిక మున్సిపాలిటీ ఆధీనంలో ఉండాలి.ఆ భూములను ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. ఒకవేళ ఆ భూములు సంవత్సరాల తరబడి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నా..వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని న్యాయ స్థానాలు సూచిస్తున్నాయి. కానీ టెంపుల్ అల్వాల్ లో గ్రామ కంఠం భూమిలో మాత్రం యధేచ్చగా భారీ నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికైనా అధికారులు అక్రమ భవనంపై చర్యలు తీసుకోని,గ్రామ కంఠం స్థలాన్ని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story