వీకెండ్ హోమ్స్.. సిటీ శివార్లలో పెరుగుతున్న రిసార్ట్స్, ఫామ్‌ల్యాండ్స్!

by Javid Pasha |   (  Updated:2026-01-17 10:43:25  IST  )

సిటీకి దూరంగా.. శివారు ప్రాంతాల్లో ‘వీకెండ్ హోమ్’లపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పచ్చని పరిసరాలు, మనసుకు హాయిగొలిపే వాతావరణం ఉండేలా వారంతపు ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. మహానగరంలో ఉద్యోగ, వృత్తి రీత్యా రణగొణ ధ్వనుల మధ్య నిత్యం జీవిస్తున్నారు. వాటి నుంచి తప్పించుకొని ఒక్కరోజైనా సిటీ బయట ప్రశాంతంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం.. పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం చేసేలా నగర శివారులో వెంచర్లలో స్థలాలు కొని, ఫామ్ ల్యాండ్స్, రిసార్ట్స్, వీకెండ్ హోమ్స్ నిర్మించుకుంటున్నారు.

వీకెండ్ హోమ్స్.. సిటీ శివార్లలో పెరుగుతున్న రిసార్ట్స్, ఫామ్‌ల్యాండ్స్!
X

దిశ,మేడ్చల్ బ్యూరో : నగరంలో ఫామ్ ల్యాండ్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. వీటిని చాలామంది కొంటున్నప్పటికీ అందులో నివాసయోగ్యంగా ఉంటున్నవి తక్కువే. కొన్నింటిలో పూలు, పండ్లు మొక్కలను పెంచుతూ.. అప్పుడప్పుడు వెళ్లి చూసుకుని రావడం తప్ప పెద్దగా ఉపయోగించుకోవడంలేదు. కొన్నిచోట్ల సామూహిక వ్యవసాయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో శివార్లలో విల్లాలు ఖరీదయ్యాయి. దీంతో మరింత దూరంలో వారంతపు నివాసాలు కొంటున్నారని, దీంతో వీకెండ్ హోమ్స్‌కు భారీ డిమాండ్ పెరుగుతున్నట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ట్రిపుల్ ఆర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్‌లు వస్తున్నట్టు పేర్కొంటున్నారు. చేగుంట, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, చెవేళ్ల, వికారాబాద్, జహీరాబాద్, సాగర్ రహదారిలలో పెద్ద ఎత్తున వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. స్థలాలు విక్రయించి వాటిలోనే వీకెండ్ హోమ్ కట్టించి ఇస్తున్నారు. మొత్తం ప్లాటింగ్ లో ఇళ్లు కట్టుకుని వారంతంలో అక్కడ ఉండేందుకు ఇష్టపడేవారికి విక్రయిస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా కమ్యూనిటీలో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటాయి. కాబట్టి ధైర్యంగా అక్కడ ఉండొచ్చు అనే భావనలో కొనుగోలుదారులు ఉన్నారు.

కుటీరాలుగా..

వారంతపు నివాసాలకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని డిజైన్ చేయిస్తున్నారు. పాత రోజుల్లో ఊర్లలో మాదిరి మండవ ఇళ్లు, కేరళ మాదిరి ఆవాసాలను నిర్మిస్తున్నారు. కలప ఇళ్లను కడుతున్నారు. సిటీలో అపార్ట్‌మెంట్లలో నాలుగు గోడల మధ్య ఫ్లాట్‌లలో ఉంటున్నవారిని ఆ తరహా కుటీరాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు వందల గజాల నుంచి వెయ్యి గజాలు, పావు, అర్ధ, ఎకరం విస్తీర్ణంలో వీకెండ్ హోమ్స్‌ను కొందరు సొంతంగా నిర్మించుకుంటుండగా.. కొన్నిప్రాజెక్టుల్లో ఏకరూపత కోసం డెవలపర్లే కట్టి ఇస్తున్నారు. వంద నుంచి రెండు వందల గజాల విస్తీర్ణం వరకే ఇంటిని పరిమితం చేసి.. మిగితా స్థలంలో పచ్చదానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్ని చోట్ల వారాంతపు నివాసాలు కడుతుంటే.. మరికొన్ని చోట్ల విదేశాల్లో మాదిరిగా వీకెండ్ హోమ్స్ కడుతున్నారు.

పెట్టుబడి కూడా..

తమ కలల వారాంతపు విడిదితోపాటు పెట్టుబడిగానూ ఉంటుందని వీకెండ్ హోమ్స్‌‌పై కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సిటీలో ఇళ్లు ఉన్నవారు రిటైర్డ్ అయ్యాక గడిపేందుకు, పిల్లల భవిష్యత్తు కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్‌లు, రిసార్ట్స్‌లు అద్దెకు తీసుకొని ఎంజాయ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వారాంతాలు, సెలవు దినాలు, పండగల సమయాల్లో రిసార్ట్స్, ఫామ్ ల్యాండ్స్ ముందస్తుగానే బుక్ అవుతున్నాయి. వరుస సెలవు దినాల్లో అయితే దొరకడం కష్టంగా మారింది. దీంతో పలువురు ఫామ్ ల్యాండ్స్ ను కొనుగోలు చేసి అద్దెలకు ఇస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు.

సకల సౌకర్యాలు..

వారాంతంలో ఇంటికి వచ్చిన వారికి సకల సౌకర్యాలు కమ్యూనిటీలో ఉండేలా చేస్తున్నారు. పార్కులతోపాటు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, రెస్టారెంట్, కామన్ కిచెన్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే ఇటీవల ప్రీమియం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఖర్చు ఎంతైనా లెక్క చేయకుండా నగర ప్రజలు పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నారు. ప్రీమియం ప్రాజెక్టుల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. అక్కడే పెళ్లి వేడుకలు, పార్టీలు చేసుకునే విధంగా సదుపాయాలు ఉంటున్నాయి.

Next Story