- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా.. పార్క్, ప్రభుత్వ స్థలాలు మాయం
హైదరాబాద్ నగర శివారులో భూముల ధరలు ఎకరా రూ.కోట్లలో పలుకుతుండడంతో రియల్టర్లు, భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలు, పార్కులను మాయం చేస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేస్తున్నారు.

దిశ, ఘట్‌కేసర్ : హైదరాబాద్ నగర శివారులో భూముల ధరలు ఎకరా రూ.కోట్లలో పలుకుతుండడంతో రియల్టర్లు, భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలు, పార్కులను మాయం చేస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహకారంతో లేఅవుట్‌లో పార్కు స్థలాలు, స్కూళ్ల కోసం కేటాయించిన భూములను రిజిస్ట్రేషన్లు చేయించి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండదండలతో అక్రమంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నారనే టాక్ వినబడుతుంది. వీరి ఆగడాలపై కాలనీవాసులు, ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైడ్రాను ఆశ్రయిస్తున్నారు.
కాలనీవాసుల ఫిర్యాదుతో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ సర్వే నంబర్ 44, 45లో శ్రీవేంకటసాయి నగర్‌లో ప్రభుత్వ స్థలాల కబ్జా పై చర్యలు తీసుకోవాలని ఆ కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించడంతో పోచారంలో జరుగుతున్న ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జా తతంగం వెలుగులోకి వచ్చింది.
లేఅవుట్‌లో హద్దుల మార్పు..
1981 సంవత్సరంలో అన్నోజీగూడ సర్వే నంబర్ 44, 45లో దాదాపు 12 ఎకరాల్లో శ్రీ వేంకట సాయి లేఅవుట్, సర్వే నెంబర్ 19, 46 లో దాదాపు 7 ఎకరాల్లో మరో లేఅవుట్ చేశారు. శ్రీవెంకటసాయి లేఅవుట్‌లో 875 గజాలు ఓపెన్ ఏరియా, 203 చదరపు గజాలు గుడి కోసం, 2,045 చదరపు గజాల స్థలం పాఠశాల కోసం కేటాయించారు. అయితే గుడి కోసం కేటాయించిన 203 చదరపు గజాల స్థలంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టగా, 875 చదరపు గజాలు ఓపెన్ ఏరియాను ప్లాట్లు చేసి అమ్మేసుకున్నట్లు సమాచారం.
పక్క సర్వేనెంబర్ పేరుతో..
పాఠశాల భవనానికి కేటాయించిన 2,045 చదరపు గజాల భూమికి ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీ వెంకట సాయి నగర్ లేఔట్ పక్కన 19, 46 సర్వే నెంబర్లలో చేసిన ఏడెకరాల లేఔట్ పక్కనే ఉండటంతో ఆ లేఔట్ సర్వే నెంబర్లు వేసి వెంకటసాయి నగర్‌లోని ఓపెన్ ఏరియాలో ప్లాట్లు చేసి అమ్ముకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ముడుపులకు ఆశపడి మున్సిపల్ అధికారులు వెంకటసాయినగర్‌లో పాఠశాల కోసం కేటాయించిన 2,045 గజాల స్థలంలో 19, 46 సర్వే నెంబర్ లేఅవుట్‌లోని పార్కు స్థలంగా బోర్డులు నాటించారని కాలనీవాసులు చెబుతున్నారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రి గృహ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
హైడ్రా చర్యలకై ఎదురుచూపులు..
పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడ సర్వే నెంబర్ 774, 775, 776, 778, 779 లో డాక్టర్స్ కాలనీలో పరాధీనంలో ఉన్న నాలుగు వేల గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. విషయం తెలుసుకున్న శ్రీ వెంకట సాయి నగర్ కాలనీవాసులు పాఠశాల కోసం కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్క్ స్థలాలు, పాఠశాల కోసం కేటాయించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా చేపట్టే చర్యల కోసం కాలనీవాసులు ఎదురు చూస్తున్నారు.
- Tags
- Pocharam






