- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medchal: అగ్గువ ధరకే ప్రభుత్వ ప్లాట్..!
60 గజాల ప్లాట్ కేవలం రూ. 4 లక్షలకే అది కూడా 30 ఫీట్ రోడ్డు కలిగి ఉన్న ప్లాట్.. అవును ఇది నిజమే. కానీ ఆ ప్లాట్ ఉండేది మాత్రం ప్రభుత్వ భూమిలో.

దిశ, మేడ్చల్ బ్యూరో: 60 గజాల ప్లాట్ కేవలం రూ. 4 లక్షలకే అది కూడా 30 ఫీట్ రోడ్డు కలిగి ఉన్న ప్లాట్.. అవును ఇది నిజమే. కానీ ఆ ప్లాట్ ఉండేది మాత్రం ప్రభుత్వ భూమిలో. స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకారంతో రాజకీయ పార్టీల నేతల అనుచరులు బహిరంగంగానే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ అగ్వ ధరకే ప్లాట్లు అంటూ అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తతంగం మేడ్చ ల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నెం. 307 ప్రభుత్వ భూమిలో.
317 ఎకరాలలో ఉన్నదెంత..?
గాజులరామారం సర్వే నెం. 307లో 441 ఎకరాల విస్తీర్ణం. దీనిలో 317 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెం. 308లో 33 ఎకరాల 11 గుంటల భూమిని, సర్వే నెం. 307లో 238 ఎకరాల 28 గుంటల భూమిని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించారు. అంటే సర్వే నెం. 307లో 238 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించగా మిగిలిన 79 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి గానే ఉంది. మొత్తంగా 317.28 ఎకరాల భూమి ఈ సర్వే నెం.లో ప్రభుత్వ భూమిగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఎంత భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది? ఎంత కబ్జా అయినది అనే లెక్కలు ఎవరి వద్ద లేవు.
ప్రభుత్వ భూమి సంరక్షణపై పట్టింపేది..?
సర్వే నెం. 307 ప్రభుత్వ భూముల్లో దశాబ్ద కాలంగా కబ్జా తంతు కొనసాగుతోంది. పట్టించుకోవలసిన రెవెన్యూ యంత్రాం గం కబ్జాదారులకు ప్రత్యక్షంగానే సహకరిస్తూ కబ్జాలను ప్రోత్సహించారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో ఇక్కడ కబ్జాదారులు పలు సందర్భాల్లో రెవెన్యూ అధికారులకు లక్షల్లో ముడుపులు అందజేశామని బహిరంగంగానే తెలియజేయడం విశేషం. దశాబ్దంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది వాస్తవం.
తప్పని పరిస్థితుల్లో ఫిర్యాదులు
గాజులరామారం సర్వే నెం. 307లో ఉన్న ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న కబ్జాల పై కొందరు స్థానికులు తరచుగా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. వీటిపై స్పందించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా పక్కన పడేస్తుందని ఆరోపణలున్నాయి. విధిలేని పరిస్థితి, తక్కువ సందర్భాల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులు అడపాదడపా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. జనవ రి 5వ తేదీ అర్ధరాత్రి కొందరు సర్వే నెం. 307 ప్రభుత్వ భూమిలో బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలతో క్వారీ గుంతలను పూడ్చి కబ్జా చేస్తున్నారంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సెక్యూరిటీ సిబ్బంది రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గులాం కలింకు ఫిర్యాదు చేయగా జగద్గిరిగుట్ట పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నాలుగు టిప్పర్లను సీజ్ చేశామని అధికారులు చెప్తున్నారు. తాజాగా సర్వే నెం. 325 పట్టా స్థలంగా పేర్కొం టూ 307లో అర్ధరాత్రి మట్టి నింపి కబ్జా చేసే పనులు చేస్తుండగా డీఆర్ఎఫ్ టీమ్, రెవెన్యూ అధికారికి తెలపడంతో ఆర్ఐ ఖలీం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ భూమిలో మట్టి పోసేందుకు వచ్చిన 7 టిప్పర్ల డ్రైవర్లపై కేసు నమోదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు పోలీస్ కేసు నమోదు చేయించే ప్రయత్నం రెవెన్యూ అధికారులు చేసిన కబ్జా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
అసలు సూత్రధారులు ఎవరు?
తాజాగా జరిగిన కబ్జా యత్నంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో టిప్పర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. కానీ వారిని ఆ పనికి ప్రోత్సహించిన వ్యక్తులపై కేసు నమోదైన దాఖలాలు కనిపించలేదు. ఫిర్యాదు చేసినా చాలా సందర్భాల్లో కేవలం అప్పుడు వినియోగించిన వాహనాలపై కేసు నమోదు చేయడం తప్ప అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ భూమిలో కబ్జా ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నాయి.
బహిరంగంగానే విక్రయాలు
వందల ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు బహిరంగగానే విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కొందరు సర్వే నెం. 307లో లేఅవుట్ డ్రా చేసి ప్లాట్ల విక్రయాలను ఓఎల్ఎక్స్‌లో పెట్టారు. తాజాగా ప్రగతి నగర్ ఇన్కాయిస్ సమీపంలో ఐదెకరాల ప్రభుత్వ భూమిలో కొందరు టిప్పర్లకొద్ది మట్టిని నింపుతున్నారు. ఈ తతంగం అంతా స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తూ వస్తున్నారని విమర్శలున్నాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో 60 గజాల ప్లాట్లు రూ. 4 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.






