రూ.800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ జరపాలి: మన్నె క్రిశాంక్

by Kodari Anjali |

ఇందిరమ్మ ఇళ్ల స్థలంలో వెలిసిన ప్రైవేటు కంచెలపై నిలదీస్తూ మన్నె క్రిశాంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

రూ.800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ జరపాలి: మన్నె క్రిశాంక్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బోయిన్‌పల్లిలో రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరమవ్వడంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి డా. క్రిశాంక్ మన్నె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన అత్యంత విలువైన భూమి ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు ఏవీ?

తిరుమలగిరి పరిధిలోని తోకట్ట సర్వే నెంబర్ 157/1 (బాలానగర్ సర్వే నెంబర్ 57/1) లో ఉన్న 8 ఎకరాల స్థలాన్ని గతంలో సిసిఎల్‌ఏ ప్రభుత్వ భూమిగా తేల్చిందని క్రిశాంక్ గుర్తుచేశారు. "గత ఏడాది ఇదే స్థలంలో 6 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే గణేష్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాలు కూడా సమర్పించారు. మంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు తిరుమలగిరి ఎంఆర్‌ఓ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను కూడా ప్రారంభించారు. కానీ, ఇంతలోనే ఆ భూమి చుట్టూ ప్రైవేటు శక్తులు కంచెలు వేసి, గూండాలతో స్థానిక ప్రజలపై దాడులు చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని క్రిశాంక్ ప్రశ్నించారు.

రూ. 5 కోట్ల లంచం ఆరోపణలు..

పేదల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు కంపెనీలు కబ్జా చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధి నోరు మెదపకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 5 కోట్ల మేర లంచం తీసుకున్నందువల్లే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నట్లు క్రిషాంక్ తెలిపారు. కేవలం 10 నెలల వ్యవధిలోనే ప్రభుత్వ భూమి ప్రైవేటు పరమవ్వడం వెనుక అధికారుల, ప్రజాప్రతినిధుల హస్తం ఉందో లేదో తేలాల్సి ఉందన్నారు.

సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ డిమాండ్లు

రాష్ట్ర ఆస్తులకు సంరక్షకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ క్రిషాంక్ పలు డిమాండ్లను లేఖలో పొందుపరిచారు. రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై తక్షణమే స్వతంత్ర విచారణ జరపాలని, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారడం వెనుక ఉన్న అధికారులు, విభాగాల పాత్రను తేల్చాలనీ, ఈ స్థలంలో కంటోన్మెంట్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి కోరారు. ప్రైవేటు సంస్థల అక్రమ ఆక్రమణల నుండి ఈ భూమిని రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టి, ఈ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, సర్వే నివేదికలను బహిరంగపరచాలనీ డిమాండ్ చేశారు.. ఈ లేఖ ప్రతులను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు కూడా పంపినట్లు క్రిశాంక్ మన్నె వెల్లడించారు.

Next Story