- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐడీపీఎల్ భూములపై విచారణ షురూ!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు అదేశించింది. కూకట్‌పల్లి నియోజకవర్గం, బాలానగర్ మండలం, ఐడీపీఎల్ పరిధి సర్వే నెంబర్‌లోని 376లో రూ.4 వేల కోట్ల విలువైన

దిశ, మేడ్చల్ బ్యూరో/ కూకట్‌పల్లి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు అదేశించింది. కూకట్‌పల్లి నియోజకవర్గం, బాలానగర్ మండలం, ఐడీపీఎల్ పరిధి సర్వే నెంబర్‌లోని 376లో రూ.4 వేల కోట్ల విలువైన భూముల కబ్జాపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఐడీపీఎల్ భూముల కబ్జాలపై ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు పరస్పర ఆరోపణలు చేసుకున్న విషయం విధితమే. కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేయగా, మాధవరం ఆయన తనయుడిపై కవిత ఆరోపణలు చేశారు. ఈ భూ వివాదం సంచలనంగా మారడంతో ప్రభుత్వం సర్వే నెంబర్ 376లో ఏం జరిగిందో తేల్చలంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది.
రూ. వేల కోట్ల భూములు కబ్జా..
వాస్తవానికి పారిశ్రామిక అభివృద్ది కోసం కేటాయించిన ఐడీపీఎల్ భూములు కబ్జాలకు గురయ్యాయని పలువురు రాజకీయ నాయకులు, వారి వారసులు ఈ అక్రమ లావాదేవీలలో పాలు పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతోపాటు కొంతమంది రాజకీయ పలుకు బడి ఉన్న వ్యక్తులు ఈ భూములను కబ్జా చేసి, అమ్ముకున్నట్లు విమర్శలు గుప్పుమన్నాయి. ఇటివల కల్వకుంట్ల కవిత, మాధవరం కృష్ణారావుల మధ్యన ఐడీపీఎల్ భూముల కబ్జాల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సర్వే నెంబర్ 376లోని భూములకు సంబంధించి గతంలో జరిగిన లావాదేవీలు, లీజులు, మార్పిడిలు, అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా రాజకీయ పలుకుబడితో కబ్జాలు జరిగాయా? అనే కోణంలో ఆ దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విచారణను స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే మాధవరం (Box)
కూకట్‌పల్లి ఐడీపీఎల్ భూములపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఐడీపీఎల్ భూములు కబ్జా చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలను సవాల్‌చేస్తూ ఎమ్మెల్యే మాధవరం.. కవిత భర్త, మరి కొంతమంది కలిసి ఐడీపీఎల్ భూములను కబ్జాచేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా మాధవరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలకు స్పందన లభించిందన్నారు. విజిలెన్స్విచారణకు ప్రభుత్వం ఆదేశించడం శుభపరిణామమని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా తనపై కబ్జాల ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించడంలో విఫలమయ్యారని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కబ్జాల పేరుతో ఆరోపణలు చేస్తున్న వారికి భూముల విచారణ సమాధానం ఇస్తుందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. మీడియా సంస్థలు సైతం ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆధారాలను చూడాలని సూచించారు. గతంలో తాను సంబంధిత అధికారులకు, కలెక్టర్‌కు ఐడీపీఎల్భూముల కబ్జా విషయంలో ఫిర్యాదు చేశానని, అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.






