సైబరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

by Ratna Kumari |

పోలీసులమంటూ నకిలీ గుర్తింపు కార్డులు, యూనిఫాంలతో హల్‌చల్ చేస్తూ, ఆర్థికంగా స్థిరపడిన వ్యాపారులను టార్గెట్ చేసి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నఓ అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
X

దిశ, పేట్ బషీరాబాద్ : పోలీసులమంటూ నకిలీ గుర్తింపు కార్డులు, యూనిఫాంలతో హల్‌చల్ చేస్తూ, ఆర్థికంగా స్థిరపడిన వ్యాపారులను టార్గెట్ చేసి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నఓ అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.

బెదిరించి కిడ్నాప్, దోపిడీ

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శోభోదయ కాలనీ సమీపంలో మే 18, 2026న ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలోని జయనగర్‌కు చెందిన వ్యాపారి కావూరి పూర్ణచంద్రరావు (42) బైక్‌పై వెళ్తుండగా.. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. తాము పోలీసులమని, మీపై హరియాణాలో క్రిమినల్ కేసు నమోదైందని బెదిరించారు. నమ్మకం కలిగించేందుకు హరియాణా పోలీసు అధికారితో ఫేక్ వీడియో కాల్ మాట్లాడించారు. అనంతరం అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని సూర్యాపేట వైపు తీసుకెళ్లారు. ఏటీఎం ద్వారా రూ.1,00,000, ఫోన్‌పే ద్వారా మరో రూ.1,00,000 డ్రా చేయించడంతో పాటు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం రూ.5,26,000 దోచుకున్నారు. ఆ తర్వాత బాధితుడిని కొట్టి, అతని సిమ్ కార్డు లాగేసుకుని, ఒక బేసిక్ మొబైల్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు.

జైలులో పరిచయం.. ముఠాగా ఏర్పాటు

ఈ ముఠా సభ్యులు జైలులో పరిచయమై, విడుదలయ్యాక ఆర్గనైజ్డ్ గ్యాంగ్‌గా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడు (A1) ఏపీకి చెందిన నాగరాజు రఘువర్మ అలియాస్ కార్తికేయ. ఇతనిపై సైబరాబాద్, హైదరాబాద్, ఏపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో 12 కేసులు ఉన్నాయి. ఇతనిపై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదు కాగా.. పోడూరు పీఎస్ లో రౌడీ షీటర్ గా ఉన్నాడు. ఈ ముఠాలో సునీల్ కుమార్ (A5) అనే హరియాణాకు చెందిన సస్పెండెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఇతను మిగతా సభ్యులకు పోలీసుల పని తీరుపై శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక సహకారం అందించేవాడు.

పట్టించిన టెక్నాలజీ

పోలీసులు సీసీ ఫుటేజీలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (యాంబిస్ యాప్), ట్రాఫిక్ చలాన్ల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి పట్టుకున్న‌ట్టు డీసీపీ తెలిపారు. నలుగురు నిందితులు అయిన నాగరాజు రఘు వర్మ అలియాస్ కార్తికేయ (ఏపీ), యశ్వంత్ సింగ్ అలియాస్ రాహుల్ (ఆగ్రా, యూపీ), , సత్యభాన్ సింగ్ అలియాస్ ఠాకూర్ (ఆగ్రా, యూపీ) తంగెళ్లపల్లి నాగేంద్ర వర్మ (హైదరాబాద్) లు అరెస్ట్ కాగా.. ప్రదీప్ కుమార్ మిశ్రా (బీహార్ - పరారీ), సునీల్ కుమార్ అలియాస్ ఫౌజీ (హరియాణా - పరారీ) పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఒక ఎయిర్ పిస్టల్, ఒక నాటు తుపాకీ (7.65 మి.మీ), పోలీసు యూనిఫాంలు, నకిలీ ఐడీ కార్డులు, ర్యాంక్ బ్యాడ్జీలు, హ్యాండ్‌కఫ్స్, లాఠీలు, పోలీసు స్టాంపులు, నేమ్ ప్లేట్లు, నకిలీ ప్రభుత్వ పత్రాలు, లెటర్ ప్యాడ్‌లు, కోర్టు సీల్స్ , నకిలీ నంబర్ ప్లేట్లు, సిమ్ కార్డులు, టాటా టియాగో కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు బాలగంగి రెడ్డి (కుత్బుల్లాపూర్ ఏసీపీ), నాగేశ్వర్ రావు (క్రైమ్స్ ఏసీపీ), పి. నరేంద్ర రెడ్డి (జగద్గిరిగుట్ట డీఐ), కె. రవికుమార్ (సీసీఎస్ ఇన్‌స్పెక్టర్), కానిస్టేబుళ్లు పురాన్ దాసు (హెడ్ కానిస్టేబుల్), నరేష్ , నరేష్ గౌడ్, సుమ, కూకట్‌పల్లి సీసీఎస్ టీమ్ నరసింహ (ఎస్సై), ఎలియాజర్ (హెడ్ కానిస్టేబుల్), అర్జున్ కుమార్ , అంజి, అస్గర్ , చందర్ లను డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Next Story