చీర్యాలలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు.. జెడ్పీ వైస్ చైర్మన్ శపథం..?

by Disha Web Desk 4 |
చీర్యాలలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు.. జెడ్పీ వైస్ చైర్మన్ శపథం..?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అక్రమానికి బరితెగిస్తే.. అధికారులే కాదు.. అపర బ్రహ్మలు అడ్డొచ్చినా ఆగేది లేదు.. అడ్డగోలుగా నిర్మాణాలు సాగించేస్తాం అన్నట్లుగా కీసర మండలం చీర్యాల గ్రామంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పంచాయితీ రాజ్ శాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో.. న్యాయస్థానం తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. ఇలా చీర్యాల గ్రామ శ్రీ నరసింహా స్వామి సాక్షిగా గ్రామంలో 200లకుపైగా అక్రమ నిర్మాణాలున్నట్లు సాక్షాత్తూ గ్రామ కార్యదర్శి నాగేశ్వర్ రావు సెలవివ్వడం విమర్శలకు తావిస్తోంది.

జెడ్పీ వైస్ చైర్మన్ శపథం..?

చీర్యాల గ్రామస్థుడైన జెడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్ గ్రామంలో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలపై గ్రామ పాలక వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో జరిగిన గ్రామ సభలో అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై జెడ్పీ వైస్ ఛైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమచారం. అవినీతి, అక్రమణలను అపితేనే తాను గ్రామ పంచాయితీ మెట్లు ఎక్కుతానని, లేదంటే ఇకపైన గ్రామ పంచాయితీకి రానని శపథం చేసినట్లు గ్రామస్థులు తెలియజేస్తున్నారు. అంటే అధికార పార్టీకి చెందిన ,జెడ్పీ వైస్ చైర్మన్ గ్రామంలో జరుగుతున్న అవినితీ, అక్రమణలపై విసుగు చెంది, గ్రామ పంచాయితీకి రానని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడంటే.. గ్రామంలో జరుగుతున్న అవినితీ, అక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇట్టే తెలిసిపోతుంది.

200లకుపైగా అక్రమ నిర్మాణాలు..

గ్రామంలో 200లకు పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. పంచాయితీ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను జరగకుండా నిలువరించాల్సిన అధికారులు, పాలకవర్గం మామూళ్ల మత్తులో జోగుతుందని ఆరోపిస్తున్నారు. చీర్యాల గ్రామ చౌరస్థా, కీసర వెళ్లే దారిలో అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు జరిపి, వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు.కీసర ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా..పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టినా పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నా.. పంచాయితీ ఖజానకు కాకుండా నేతలు, అధికారులు జేబులు నింపుకోవడంపై గ్రామస్థులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఒత్తిళ్లు..

గ్రామంలో అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో అధికారులు, పాలక వర్గం సభ్యులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు పంచాయితీ సిబ్బంది ఒక వేళ సాహసించినా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూల్చకుండా ఉద్యోగులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు గ్రామ పంచాయితీ సిబ్బంది వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లేలోపే ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ లు వస్తాయని చెబుతున్నారు. ఒకవేళ నిర్మాణాలను అపాలని నిర్మాణదారుల నుంచి పనిముట్లను స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయితీలో భద్రపరిచిన వాటిని తమ అనుమతులు లేకుండానే నిర్మాణదారులకు అప్పగిస్తున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై చర్యలేలా..? తీసుకునేదని మదన పడుతున్నారు. ఇప్పటికైనా గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు జిల్లా పంచాయితీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Next Story

Most Viewed