ఆ ఒక్కటి ఉంటే చాలు.. విద్యతో అవినీతి దందా షురూ

by Naga Rani Yarlagadda |

విద్యా వ్యాపారం బాచుపల్లి మండలంలో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. స్కూల్ స్థాపించడానికి ఏమాత్రం ప్రొసీజర్ అవసరం లేదు, నిబంధనలు అంతకన్నా అవసరం లేదు.

ఆ ఒక్కటి ఉంటే చాలు.. విద్యతో అవినీతి దందా షురూ
X

దిశ, కుత్బుల్లాపూర్ : విద్యా వ్యాపారం బాచుపల్లి మండలంలో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. స్కూల్ స్థాపించడానికి ఏమాత్రం ప్రొసీజర్ అవసరం లేదు, నిబంధనలు అంతకన్నా అవసరం లేదు. కావాల్సింది ఒకటే.. విద్యా వ్యాపారం కోసం విద్యా శాఖ మేడ్చల్ జిల్లా, మండల అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి చేతి నిండా డబ్బులు ఉంటే సరిపోతుంది. ఎలాంటి లీగల్ అనుమతుల పత్రాలు అవసరం లేకుండానే ఎంచక్క ప్రైవేట్ స్కూల్ స్థాపించి పేదలు, మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ రూ.లక్షలు దండుకోవడానికి రాజబాట వేసుకోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చట్ట విరుద్ధంగా అడ్మిషన్స్..

బాచుపల్లి మండలం నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఓ వ్యక్తి విద్యా శాఖ మండల, జిల్లా అధికారుల సహకారంతో క్వాంటా నోవా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో డే కేర్, ఫ్రీ స్కూల్, ప్రైమరీ, హై స్కూల్ అంటూ ఓ భవంతిలో భారీ ఎత్తున పాఠశాల బోర్డులు ఏర్పాటు చేశాడని తెలిసింది. దర్జాగా చట్ట విరుద్ధంగా అడ్మిషన్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా స్కూల్ కార్యకలాపాలను నడపటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యా శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే అకాడమిక్ విద్యను ప్రారంభిస్తూ అడ్మిషన్స్ తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్కూల్ నిర్వహణ, ఎంఈఓ సహకారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం పై ‘దిశ’ ప్రతినిధి బాచుపల్లి ఎంఈఓ రామకృష్ణను వివరణ కోరగా క్వాంటనోవా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు విద్యా శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మీ సహకారం వల్లే ఇలాంటి స్కూల్స్ బాచుపల్లి మండలంలో నడుస్తున్నాయానే ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించగా పరిశీలించి నోటీసులు ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేశారు.

Next Story