ఘట్కేసర్ సీలింగ్ భూమి రగడ.. ఇంపౌండ్ డాక్యుమెంట్ చట్టబద్ధతపై సందేహం

by Naga Rani Yarlagadda |

ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో సర్వేనెంబర్ 127/బి లో 1.39 ఎకరాల డిలీటెడ్ భూమి వివాదంలో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఘట్కేసర్ సీలింగ్ భూమి రగడ.. ఇంపౌండ్ డాక్యుమెంట్ చట్టబద్ధతపై సందేహం
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో సర్వేనెంబర్ 127/బి లో 1.39 ఎకరాల డిలీటెడ్ భూమి వివాదంలో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘట్కేసర్ చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి ‘‘ప్రైమ్ ల్యాండ్’’ వెంచర్ నిర్వాహకుడైన లింగారెడ్డి తనకు అమ్మాడని చెప్పుకుంటూ తప్పుదారిలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంపౌండ్ డాక్యుమెంట్ సృష్టించారని ప్రైమ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు, లింగారెడ్డి వారసులు చెబుతున్నారు. దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన పట్టణ నర్సరీ భూమిని ప్రైవేటు వ్యక్తికి అప్పగించేందుకు ముడుపులకు ఆశపడి ఇంపౌండ్ డాక్యుమెంట్ కు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకు తేడా గుర్తించకుండా అధికారులు ప్రైవేటు వ్యక్తికి పట్టణ నర్సరీ భూమిని అప్పగించారని విమర్శలు వస్తున్నాయి.

డిలీటెడ్ భూమే ప్రభుత్వ సీలింగ్ భూమి..?

ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 127 పి, 128, 136 పి, 137 పి, 139పి, 145పి, 154 పి, 155పి లో దాదాపు 40 ఎకరాల భూమిని హరికిషన్ మలాని నుంచి ఏజీపీ ద్వారా 2004 సంవత్సరంలో ప్రైమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధి లింగారెడ్డి హుడా వెంచర్ చేశారు. అయితే ఈ వెంచర్ లో 127 సర్వేనెంబర్ లోని 1.39 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని కలిపి వెంచర్ చేసి లేఔట్ లో ఒకవైపు 1.39 ఎకరాలు "డిలీటెడ్ భూమి"గా చూపిస్తూ హుడా లేఅవుట్ అప్రూవల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ‘‘డిలీటెడ్ భూమి’’లో 2021 లో ఘట్కేసర్ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి పట్టణ నర్సరీని రూ.23 లక్షలతో ఏర్పాటు చేశారు. అదనంగా రూ.15 లక్షలతో నర్సరీని అభివృద్ధి చేశారు. 2024 ఫిబ్రవరిలో పట్టణ నర్సరీ ఏర్పాటు చేసిన భూమి తనదేనంటూ, తనకు ప్రైమ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకుడు లింగారెడ్డి 1.39 ఎకరాల భూమి అమ్మారని ఘట్కేసర్ కు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి నర్సరీ ఏర్పాటు చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని విఫల ప్రయత్నాలు చేశారు. చివరకు ఇంపౌండ్ డాక్యుమెంట్ సృష్టించి అధికారులను తప్పుదారి పట్టించి పట్టణ నర్సరీ భూమిని స్వాధీనం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇంపౌండ్ డాక్యుమెంట్లో సంతకాలు ఫోర్జరీ..

40 ఎకరాల్లో చేసిన ప్రైమ్ ల్యాండ్ లేఔట్ పక్కనే 1.39 ఎకరాల డిలీటెడ్ భూమిగా పట్టేదారులు వదిలేస్తే... ఏజీపీ తీసుకున్న లింగారెడ్డి ఏ హక్కులతో డిలీటెడ్ భూమిని అమ్మాడని, అది ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రైమ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు, లింగారెడ్డి వారసులు ప్రశ్నిస్తున్నారు. లింగారెడ్డి వద్ద అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పడం అబద్ధమని, ఆయన బతికున్నప్పుడే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. 2023 ఆగస్టు 19వ తేదీన లింగారెడ్డి చనిపోయాక తప్పుడు పద్ధతిలో, ఫోర్జరీ సంతకాలతో 2024 ఏప్రిల్ నెలలో ఇంపౌండ్ డాక్యుమెంట్ సృష్టించారని లింగారెడ్డి వారసులు తెలిపారు.

మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దాదాపు రూ. 24 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించి ఇంపౌండ్ డాక్యుమెంట్ చేసుకుంటే సరిపోదని, కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేనిపక్షంలో కోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఘట్కేసర్ కు చెందిన వ్యక్తి స్థానిక అధికారులతో కుమ్మకై, కావాలని రూ. కోట్ల విలువచేసే భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. హుడా అధికారులు అప్రూవల్ చేసిన లేఔట్ ను పూర్తి స్థాయిలో పరిశీలించకుండా ఘట్కేసర్ రెవెన్యూ అధికారులు వెంచర్ లోని 24 ప్లాట్లకు పీఓటీ నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. తహసీల్దార్ ఇచ్చిన నోటీసులకు హైకోర్టు స్టే ఉత్తర్వులు ఎలా ఇచ్చారని అన్నారు. ఏదేమైనా ప్రభుత్వ సీలింగ్ భూమి గుర్తింపు విషయంలో ఘట్కేసర్ రెవెన్యూ అధికారులు మరోసారి విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ సీలింగ్ భూమిని కాపాడిన వారు అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story