- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వంశీ మోహన్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడవుతోంది.

ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్
l 8 ఇళ్లు, బంధువుల నివాసాల్లో
ఏకకాలంలో దాడులు
l రూ.వందల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
దిశ, మేడ్చల్ బ్యూరో/ రంగారెడ్డి బ్యూరో / వనస్థలిపురం: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వంశీ మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆయనతో పాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. రూ.వందల కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టా వెలుగు చూసినట్లు సమాచారం.
ప్రభుత్వ భూములే లక్ష్యంగా..
గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవో, తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వంశీ మోహన్.. ఆ సమయంలో తన పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొట్టేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని పిగ్లీపురంలో ఏకంగా 8 ఎకరాల విలువైన భూమిని కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. సదరు భూమిని తన మామ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ బడా రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
గత ప్రభుత్వ పెద్దల అండ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వంశీ మోహన్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడవుతోంది. అప్పటి అధికార పార్టీ పెద్దలతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితను అక్క అని, కేటీఆర్‌ను అన్న అని, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను బావ అని పలకరిస్తూ.. ఆ సాన్నిహిత్యంతోనే కీలక పోస్టింగ్‌లు దక్కించుకొని, యథేచ్ఛగా పైరవీలకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు.. బ్యాంక్ లాకర్లు, ఇతర బినామీ ఆస్తుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు ముగిసేనాటికి ఈ అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఆధారాలు సేకరించిన అనంతరం వంశీ మోహన్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ కె.వంశీ మోహన్‌కు సంబంధించిన నివాసాలపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్దాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. పిగ్లీపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 17లో 287 ఎకరాల సీలింగ్ భూమి ఉండగా.. అందులో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. నకిలీ పత్రాలతో తొలుత తన మామ పేరున భూమిని బదలాయించి ఆ తర్వాత ఓ రియల్టర్‌కు ఆ భూమిని ధారాదత్తం చేయడంపై ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. క్విడ్ ప్రోకో పద్ధతిన సదరు రియల్టర్ నుంచి 10 ప్లాట్లను తన పేరిట గిఫ్ట్ డీడ్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.






