కార్మికుల హ‌క్కుల సాధ‌న‌కు సీఐటీయూ నిరంత‌ర ఉద్య‌మం

by Ratna Kumari |

కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక భద్రత సాధనకే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆవిర్భవించిందని మేడ్చల్ జిల్లా సీఐటీయూ కోశాధికారి పి. గణేష్ అన్నారు.

కార్మికుల హ‌క్కుల సాధ‌న‌కు సీఐటీయూ నిరంత‌ర ఉద్య‌మం
X

దిశ, నాచారం : కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక భద్రత సాధనకే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆవిర్భవించిందని మేడ్చల్ జిల్లా సీఐటీయూ కోశాధికారి పి. గణేష్ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాచారంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి. గణేష్ సీఐటీయూ జెండాను ఆవిష్కరించి కార్మిక ఉద్యమాల చరిత్రను స్మరించుకున్నారు. 1970 మే 30న కార్మిక వర్గ ఐక్యత, హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యాలుగా సీఐటీయూ ఏర్పాటైందని తెలిపారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు కార్మికుల సంక్షేమం, కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాల అమలు, సామాజిక భద్రత కోసం సంస్థ నిరంతరం పోరాటాలు సాగిస్తోందని పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లోపించిందని వారు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం, కార్మిక కుటుంబాల అవసరాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా వేతనాలు నిర్ణయించారని ఆరోపించారు. కార్మికులకు గౌరవప్రదమైన జీవనం అందేలా శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా కనీస వేతనాలను పునర్నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలు కల్పించాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగితే సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటిత శక్తి అవసరమని, రాబోయే రోజుల్లో సీఐటీయూను మరింత బలోపేతం చేసి కార్మిక వర్గ ప్రయోజనాల సాధనకు కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బలరాజ్, సంజీవ్, అంజయ్య, ఎల్లేష్, రమేష్, రామకృష్ణ పాల్గొన్నారు.

Next Story