కేంద్రం బాకీ రూ.1145.17 కోట్లు

by velandi.Saikiran |   (  Updated:2025-11-28 22:15:24  IST  )

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి. దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్

కేంద్రం బాకీ రూ.1145.17 కోట్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి. దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డును నిధుల సమస్య వేధిస్తోంది. బోర్డుకు నిధులు ఇవ్వకుండా కేంద్రం శీతకన్ను ప్రదర్శిస్తోంది. కేంద్రం ఆధీనంలో ఉండే బోర్డుకు అన్ని విధాలుగా సహకరించాల్సిన సమయంలో చేతులెత్తేస్తుండటంతో అభివృద్దిలో పోటీపడలేక బోర్డు చతికలపడుతోందనే టాక్ వినబడుతుంది. బోర్డు పరిధిలోని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలిటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను చెల్లించడం లేదని సమాచారం.

రూ.1145 కోట్ల బాకీ..

కంటోన్మెంట్ బోర్డుకు సర్వీస్ చార్జీల రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.1145.17 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. వీటిలో రూ.1136.40 కోట్లు ఆర్మీ నుంచి రావాల్సి ఉండగా, రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ ఎస్టేట్‌ల నుంచి సర్వీస్ చార్జీల రూపంలో బోర్డుకు చేల్లించాలి. గత 10 ఏళ్లుగా కంటోన్మెంట్ బోర్డుకు బకాయిలు చేల్లించకపోవడంతో భారీ మొత్తంలో పేరుకుపోతున్నాయి. కేంద్రం నుంచి సర్వీస్ చార్జీలు చేల్లించాలని పలుమార్లు కంటోన్మెంట్ బోర్డు రక్షణ శాఖకు విన్నవించినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. కనీసంలో వీటిలో రూ.100 కోట్లు అయినా చెల్లించాలని కేంద్రం ముందు గతంలో స్థానిక మాజీ బోర్డు సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం కనికరించకపోవడం గమనార్హం. ఇప్పటికే నిధులు లేక బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా తయారవ్వగా.. పన్నుల రూపంలో వస్తున్న బోర్డు ఆదాయంతో ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోకపోతుండటం విశేషం. కానీ బకాయిల విషయంలో స్థానిక మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నామినేటెడ్ బోర్డు సభ్యురాలు భానుక నర్మద మల్లీకార్జున్‌ చొరవ చూపకపోతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర సర్కారే మేలు..

కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా రాష్ట్ర సర్కారు మాత్రం బోర్డుకు దశల వారీగా నిధులను విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తోంది. కంటోన్మెంట్‌లోని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ (టీపీటీ) నిధులను రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఇప్పటికే పలు దఫాలలో విడుదల చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 13,14,15, ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం బోర్డు ఖాతాలో జమ చేసింది. బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తుందని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదతో సహా, ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకే చెందిన వారైనప్పటికీ, సర్వీస్ బకాయిలను ఇప్పించడంలో తీవ్రంగా విఫలం చెందారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం శీతకన్ను..

- శ్రీగణేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే

కంటోన్మెంట్‌కు 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ చార్జీలు చెల్లించకుండా శీతకన్ను ప్రదర్శిస్తోంది. దీంతో కంటోన్మెంట్ బోర్డు నిధుల లేమితో దివాలా తీస్తోంది. ఉద్యోగులకు జీతభత్యాలు చేల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పారిశుధ్య, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ల నిర్వహణకు నిధులు లేక అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే చాలా సార్లు బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, నిధులు ఇవ్వకుండా కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే కంటోన్మెంట్ బోర్డు మనుగడ సాధిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, జీహెచ్ఎంసీలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ ప్రజలకు కూడా అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది.

Next Story