ఒకేసారి జనగణన, బడిబాట

by velandi.Saikiran |

ప్రభుత్వాలు మారినా, పథకాలు మారినా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాలు మాత్రం తీరడం లేదు.

ఒకేసారి జనగణన, బడిబాట
X

అటు సర్వేలు.. ఇటు టార్గెట్లు

క్షేత్రస్థాయి సిబ్బందికి తప్పని తిప్పలు!

ఒకేసారి జనగణన, బడిబాట..

వేసవిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు విధులపై పెదవి విరుపు

బడిబాటలో 10 శాతం అడ్మిషన్లు పెంచాలన్న లక్ష్యంతో తీవ్ర ఒత్తిడి

ఆశా వర్కర్లపైనా బీఎల్‌టీ, హెచ్‌ఎల్‌టీ డ్యూటీల భారం

ఏదో ఒక విధి నుంచి మినహాయింపు ఇవ్వాలని క్షేత్రస్థాయి సిబ్బంది వేడుకోలు

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వాలు మారినా, పథకాలు మారినా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వాల ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ అట్టడుగున ఉన్న ఉద్యోగుల భుజస్కంధాలపైనే పడుతున్నాయి. రాష్ట్రంలో ఒక పక్క జాతీయ స్థాయి జనగణన (సెన్సస్), మరోపక్క విద్యాశాఖ 'బడిబాట' కార్యక్రమాలు ఒకేసారి వచ్చిపడటం ఉపాధ్యాయులను కుంగదీస్తోంది. ఇంకోపక్క వైద్యారోగ్య శాఖలో కీలకంగా ఉన్న ఆశా వర్కర్లకు.. వారి రెగ్యూలర్ పనులతో పాటు అదనపు సర్వే విధులు అప్పగించడం ప్రాణసంకటంగా మారింది. సరైన వనరులు, సమయం లేకుండా ఈ టార్గెట్లు ఎలా పూర్తి చేయాలని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాల సమన్వయ లోపం, రాజకీయ ఆధిపత్య పోరుకు తాము బలిపశువులం అవుతున్నామని క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు బడిబాట.. సాయంత్రం జనగణనా?

రాష్ట్రవ్యాప్తంగా ప్రొ. జయశంకర్ బడిబాట (విద్యా వారోత్సవాలు) కార్యక్రమం మే 14 నుంచి జూన్ 19 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం చేసి, బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం నమోదు పెంచాలన్నది లక్ష్యం. అయితే సరిగ్గా ఇదే సమయంలో (మే 11 నుంచి) జాతీయస్థాయి జనగణన కూడా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఫీల్డ్‌లో ఉండి జనగణన టార్గెట్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తు న్నారు. ఒకే సమయంలో ఒక ఉపాధ్యాయుడు ఇటు పిల్లల అడ్మిషన్ల కోసం బడిబాటలో తిరగాలా? లేక జనాభా లెక్కల సేకరణ చేయాలా? అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. వేలాది జనాభా ఉన్న ప్రాంతాల్లో కేవలం ఇద్దరు ముగ్గు రు ఉపాధ్యాయులతో ఈ బృహత్తర కార్యక్రమాలను ఎలా నెట్టుకొస్తారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

సెన్సస్‌కు గండికొట్టే కుట్రేనా?

ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెన్సస్‌ను అడ్డుకునేందుకే లేదా అందులో లోపాలు తలెత్తేలా చేసేందుకే.. కావాలని రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని సైతం అదే సమయంలో తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. జనాభా లెక్కల సేకరణ జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉపాధ్యాయులకు ద్వంద్వ విధులు అప్పగించి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, ఏదైనా లోపం జరిగితే చివరకు ఉపాధ్యాయులపైనే నెపం నెట్టే ప్రయత్నం జరుగుతోందని వారు వాపోతున్నారు. జూన్ వరకు బడిబాటను వాయిదా వేస్తే బాగుంటుందని లేదా సెన్సస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

ఆశా వర్కర్లకూ తప్పని ‘స్మార్ట్’ కష్టాలు

క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఆశా వర్కర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వారు ప్రతిరోజూ చేయాల్సిన ఆశా పనుల టార్గెట్లకు అదనంగా బీఎల్‌టీ, హెచ్‌ఎల్‌టీ డ్యూటీలను అధికారుల వారి నెత్తిన రుద్దుతున్నారు. ఏ ఏరియాలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారో, అక్కడే ఈ విధులు వేయకుండా ఎక్కడెక్కడో వేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ సర్వేలు చేయడానికి 4జీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. కానీ చాలా మంది పేద ఆశా వర్కర్ల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు.. ఉన్నా వాటిని వాడే సాంకేతిక నైపుణ్యం వారికి లేదు. వయోభారంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సైతం కనికరించకుండా సర్వేల కోసం రోడ్ల మీద పంపుతున్నారని ఆశా వర్కర్ల యూనియన్లు మండిపడుతున్నాయి. ఫోన్లు లేని వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణమే ఈ డ్యూటీల నుంచి రిలీవ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఏకకాలంలో బహుళ విధులు అప్పగించి అద్భుతాలు ఆశించడం హాస్యాస్పదం. ఉపాధ్యాయులను కేవలం బోధన, విద్యాభివృద్ధికి పరిమితం చేయాల్సిన చోట.. వారిని సర్వేల యంత్రాలుగా మార్చడం విద్యావ్యవస్థకు సరైనది కాదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అలాగే కనీస వేతనాలు, సౌకర్యాలు లేని ఆశా వర్కర్లపై సాంకేతికపరమైన సర్వేల భారం మోపడం వారిని మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు తక్షణమే ఈ సమన్వయ లోపాన్ని సవరించి, ఎవరికి ఏ డ్యూటీలు కేటాయించాలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో అటు జనగణన, ఇటు బడిబాట రెండూ లక్ష్యాన్ని చేరుకోకుండా నీరుగారిపోయే ప్రమాదం ఉంది.

Next Story