- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టికెట్ల కేటాయింపుల్లో.. కారు జోరు.. హస్తం బేజారు
పుర‘పోరు’ రసవత్తరంగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది. కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులకు టికెట్లను కేటాయించి.

దిశ,మేడ్చల్ బ్యూరో: పుర‘పోరు’ రసవత్తరంగా మారింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది. కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులకు టికెట్లను కేటాయించి.. ఒక అడుగు ముందంజలో ఉంది.అభ్యర్థులతో ఒకవైపు నామినేషన్లను దాఖలు చేయిస్తూనే.. మరోవైపు ప్రచార పర్వాన్ని హోరేత్తిస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీకి టికెట్ల కేటాయింపు కత్తిమీద సాముల తయారైనట్లుంది.హస్తం పార్టీలో ఒక్కోవార్డులో పోటీ దారులు అధిక సంఖ్యలో ఉన్నందున అభ్యర్థుల ప్రకటన అలస్యమవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.వీటికి తోడు బీజేపీ పార్టీ అచితూచి అడుగులు వేస్తోంది.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలలో టికెట్ దక్కని అసంతృప్తులకు గాలం వేసే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది.
కారు జోరు...
మేడ్చల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట, ఆలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది.బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మెజారిటీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు గులాబి పార్టీ నుంచే ఎంపికయ్యారు.బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ కి దక్కినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పెద్దగా వీడలేదు. దీంతో ఈ మూడు మున్సిపాలిటీలో మాజీ ప్రజాప్రతినిధులకే బీఆర్ఎస్ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.టికెట్ కేటాయింపులను కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి త్వరగా పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ మల్లారెడ్డి ప్రచార పర్వాన్ని తనదైన శైలిలో హోరేత్తిస్తున్నారు.రోజుకో మున్సిపాలిటీలలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ..కారు జోరును పెంచుతున్నారు.
హస్తం వెనుకంజ..
ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచి హడావిడి చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం వెనుకంజలో ఉంది. మూడు మున్సిపాలిటీలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ ఇన్ చార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ కార్యకర్తల సమన్వయ సమావేశాలు నిర్వహించారు.మూడు మున్సిపాలిటీల ఎన్నికల ఇన్ చార్జీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వారం క్రితమే సేకరించారు.ఆయా వార్డులలో దరఖాస్తుదారుల గెలుపోటములపై సర్వే కూడా హస్తం పార్టీ నిర్వహించింది. అయితే నామినేషన్ గడువుకు ఒకరోజు ముందు కూడా అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడంలో ఈ పార్టీ మీన మేషాలు లెక్కిస్తోంది. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టికెట్ కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుండడం ఆ పార్టీ క్యాడేర్ ను నిస్తేజానికి గురి చేస్తోంది.దీంతో కొందరు పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
కమలం గాలం..!
పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లను సాధించిన బీజేపీ,పురపాలిక ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది.మూడు మున్సిపాలిటీల్లోని పలు వార్డులలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని పార్టీశ్రేణులే చెబుతున్నారు.దీంతో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలకు కాషాయ పార్టీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీలో చేరితే టికెట్ ఇస్తామని అఫర్ ఇస్తున్నట్లు సమాచారం ఉంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో టికెట్లు దక్కని పలువురు నేతలు కమలం గూటీకి చేరేందుకు రేడీ అవుతున్నారు. సిట్టింగ్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం రాత్రి కీలక నేతలు, ఆశావహులతో ప్రత్యేకంగా బేటీ ఆయ్యారు. గురువారం ఎల్లంపేట, ఆలియాబాద్ మున్సిపాలిటీలలో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో ఈటల పాల్గొన్నారు. ఇలా మొత్తంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఎన్నికలలో కారు పార్టీ కొంత జోరును కనబరుస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
మూడింట్లో విజయం సాధిస్తాం.. మర్రి రాజశేఖర్ రెడ్డి
మూడు మున్సిపాలిటీలలో గెలుపు అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు ఆలియాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఎమ్మెల్యే ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ఆలియాబాద్ మున్సిపాలిటీ లో ప్రజా సేవలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ కు పోటీనే ఇవ్వవని స్పష్టంచేశారు.మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని ఛైర్మన్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. అదేవిధంగా మూడు చింతపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలలోనూ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, మూడింటిలో గెలుపొంది కేసీఆర్ కు మూడు మున్సిపాలిటీలను కానుకగా ఇస్తామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
-మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆలియాబాద్ ఎన్నికల ఇన్ చార్జీ






