బీజేపీ పవర్ గేమ్..!కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో మంతనాలు

by velandi.Saikiran |   (  Updated:2026-02-15 21:30:40  IST  )

ఎల్లంపేట,ఆలియాబాద్ హంగ్ మున్సిపాలిటీలలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది.బీజేపీ ఏ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలు ఆ రెండు హంగ్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పీఠాలను సులువుగా గెలుసుకునే వీలుంది.దీన్నే అవకాశంగా భావించిన బీజేపీ ఏదో ఒక మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది.

బీజేపీ పవర్ గేమ్..!కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో మంతనాలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో: బీజేపీ పవర్ గేమ్ అడుతోందా..? మున్సిపల్ ఛైర్మన్ గిరిపై కన్నేసిందా..? ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుతుందా..? మేడ్చల్ జిల్లాలోని హంగ్ మున్సిపాలిటీల్లో కమలం పార్టీ తీరును గమనిస్తుంటే నిజమేన నిపిస్తోంది.ఎల్లంపేట,ఆలియాబాద్ హంగ్ మున్సిపాలిటీలలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది.బీజేపీ ఏ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలు ఆ రెండు హంగ్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పీఠాలను సులువుగా గెలుసుకునే వీలుంది.దీన్నే అవకాశంగా భావించిన బీజేపీ ఏదో ఒక మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది.కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఏ పార్టీ ఛైర్మన్ పీఠాన్నిఇచ్చేందుకు ముందుకు వస్తే.. ఆ పార్టీతో జతకట్టేందుకు బీజేపీ రేడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రెండు పార్టీలతో మంతనాలు..

ఎల్లంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ సునాయశంగా కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, కాషాయ పార్టీ తిరకాసు పెట్టింది. ఎల్లంపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా, 12 వార్డులను బీఆర్ఎస్ గెలుసుకుంది.కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు, బీజేపీ నాలుగు వార్డులు గెలుసుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు ఒక సీటు తక్కువగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో ఎక్స్ అఫీషియో ఓటు (సంఖ్యబలం 13తో) ద్వారా మున్సిపాలిటీని గులాబీ ఖాతాలో వేసుకోవాలని భావించారు. అయితే బీఆర్ఎస్ ప్లాన్ కు బీజేపీ బ్రేక్ వేసింది. స్థానిక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం అదే ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఆ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీతో బీజేపీ జతకట్టినట్లయితే సీట్ల సంఖ్యబలం 12 కు పెరుగుతోంది, ఈటల రాజేందర్ ఎక్స్ అఫిషీయో ఓటు తో కలిపితే ఆ బలం 13 సీట్లకు పెరిగి, సరి సమానం అవుతాయి.దీంతో ఎల్లంపేటలో బీఆర్ఎస్ కు ఛైర్మన్ పీఠం దక్కాలంటే మరో సీటు కావాల్సి ఉంటుంది.గులాబీ పార్టీ ఆశలు సన్నగిల్లుతాయి.దీన్నే సాకుగా చూపించి బీజేపీ ఆలియాబాద్ లో బీజేపీ సహకరించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.లేదంటే కాంగ్రెస్ పార్టీతో జతకట్టి,బీఆర్ఎస్ ను రెండు మున్సిపాలిటీల్లో దెబ్బ కొట్టేందుకు బీజేపీ బిగ్ ప్లాన్ వేసినట్లు తెలిసింది.

ఆలియాబాద్ పై కాంగ్రెస్ గురి..

ఆలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా, కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించి,అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ బీఆర్ఎస్ 7 స్థానాలను, బీజేపీ 3 స్థానాలను గెలుసుకుంది. ఒకరు బీఎస్సీ, మరొకరు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. బీఎస్పీ,ఇండిపెండెంట్లుగా గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులు ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలిసింది.దీంతో ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 10కి పెరిగినట్లైంది. ఇంకోకరు ఓటు వేస్తే ఆలియాబాద్ లోకాంగ్రెస్ కు ఛైర్మన్,వైస్ ఛైర్మన్ పీఠాలు దక్కనున్నాయి.ఎల్లంపేటలో బీజేపీకి ఛైర్మన్ పీఠం దక్కేలా కాంగ్రెస్ సహకరిస్తే, ఆలియాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ఇరు పార్టీల పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎల్లంపేటలో కాంగ్రెస్, బీజేపీ కూటములకు ఛైర్మన్ పీఠం దక్కాలంటే ఇంకోక ఓటు కావాలి.దీంతో బీఆర్ఎస్ పార్టీలో చీలికలు తెచ్చి,ఎల్లంపేట ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని రెండు జాతీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రతిఫలంగా ఆలియాబాద్ లో కాంగ్రెస్ కు ఛైర్మన్ పీఠాన్ని దక్కేందుకు బీజేపీకి సహకరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఎల్లంపేట, ఆలియాబాద్ లలో మున్సిపల్ పాలిటీక్స్ రక్తి కట్టిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా ఆ రెండు మున్సిపాలిటీలలో ‘కింగ్ ’ఎవరో తేలనుంది.

Next Story