కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారమ్ టెన్షన్

by velandi.Saikiran |   (  Updated:2026-01-31 21:15:35  IST  )

నామినేషన్లు దాఖలు చేశారు.. కానీ, బీ ఫారమ్ వస్తుందా..? రాదా..? అనే టెన్షన్ కౌన్సిలర్ అభ్యర్థులను వేధిస్తోంది.ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అత్యధిక వార్డులలో అభ్యర్థులను ప్రకటించలేదు.

కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారమ్ టెన్షన్
X

బీ ఫారమ్ దక్కేదెవరికో..?

కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫారమ్ టెన్షన్

అభ్యర్థిత్వం ఖరారుపై సందిగ్ధత

మూడు మున్సిపాలిటిల్లో మొత్తం వార్డుల సంఖ్య 68

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దాఖలైన నామినేషన్లు 430

దిశ,మేడ్చల్ బ్యూరో: నామినేషన్లు దాఖలు చేశారు.. కానీ, బీ ఫారమ్ వస్తుందా..? రాదా..? అనే టెన్షన్ కౌన్సిలర్ అభ్యర్థులను వేధిస్తోంది.ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అత్యధిక వార్డులలో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో బీ ఫారమ్ తమకు దక్కుతుందో.. లేదోనని ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది.మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు చివరి వరకు సస్పెన్స్ లో పెట్టారు. బీ ఫారాలు ఇవ్వకున్నా కొందరు ఆశావహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పోటీ ఉంది. బీఆర్ఎస్,బీజేపీ పార్టీలలో కూడా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు,ముగ్గురు పోటీలో ఉన్నారు.

వార్డుల కంటే అధిక నామినేషన్లు..

ఆలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు కలిసి మొత్తం 144 నామినేషన్లను దాఖలు చేశారు.ఇందులో కాంగ్రెస్ పార్టీ తరపున అత్యధికంగా 47 నామినేషన్లు దాఖలవ్వగా, బీఆర్ఎస్ పార్టీ తరపున 38,బీజేపీ తరపున 31 దాఖలయ్యాయి. అదేవిధంగా ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, మొత్తం కలిపి 214 నామినేషన్లు వేశారు.ఇక్కడ కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకే 66 నామినేషన్లు దాఖలయ్యాయి.బీఆర్ఎస్ నుంచి 59 నామినేషన్లు,బీజేపీ నుంచి 41 నామినేషన్లు దాఖలయ్యాయి.ఇకపోతే మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులకుగాను మొత్తం 175 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 75 మంది నామినేషన్లు దాఖలవ్వగా, బీఆర్ఎస్ నుంచి 53 దాఖలయ్యాయి,బీజేపీ నుంచి కూడా 41 మంది నామినేషన్లు వేశారు.ఇలా మూడు మున్సిపాలిటీలలో కలిపి కాంగ్రెస్ పార్టీ తరపున 170 నామినేషన్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 150,బీజేపీ తరపున 110 నామినేషన్లు వేశారు. ఉన్న 68 వార్డుల కంటే ప్రధాన పార్టీల నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలు కావడంతో బీ ఫారమ్ వస్తుందా..? లేదా ..? భయం పట్టుకుంది.

ఎత్తుగడ సక్సెస్..

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు చాలా వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా వార్డులలో పోటీ అధికంగా ఉండడంతో అభ్యర్థులను ఖరారు చేయకుండా,శుక్రవారం నామినేషన్ ల గడువు ముగిసే వరకు మూడు పార్టీలు వేసిన రాజకీయ ఎత్తుగడ సక్సెస్ అయ్యింది.అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటిస్తే, టికెట్ రాని వారు ఇతర పార్టీల నుంచి పోటికి దిగుతారన్న ఉద్దేశంతో చివరి వరకు పేర్లు ప్రకటించకుండా దాటవేత ధోరణి అవలంభించాయి. అయితే చాలా మంది అభ్యర్థులకు మాత్రం నామినేషన్ లు వేసుకోవాలని ముఖ్య నాయకులు సూచనప్రాయంగా చెప్పారు. టికెట్ వస్తుందన్న ధీమా ఉన్నా, బీ ఫారమ్ సమర్పించేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్పటి వరకు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో..? ఎవరు ఎలాంటి పైరవీలు చేస్తారోనన్న భయం లోలోపల వేంటాడుతోంది. భీ ఫారమ్ లు అభ్యర్థుల చేతికి ఇవ్వకుండా నామినేషన్ల దాఖలు పూర్తైన తర్వాత నేరుగా అధికారులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఎవరి ధీమా వారిదే...

కాగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశావహులు నమ్ముతున్నారు.ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని ఏవరికి వారే తమ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.బీఆర్ఎస్ తోపాటు బీజేపీకి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకీ అత్యధిక ఓట్లు వచ్చాయి. ఎంపీగా ఈటల రాజేందర్ నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పార్లమెంట్ నియోజకవర్గమంతా అర్బన్ ప్రాంతం కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు తమవైపు మొగ్గు చూపుతారని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చామకూర మల్లారెడ్డి ఘన విజయం సాధించారు. అంతకు ముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది.క్యాడర్ కూడా ఇతర పార్టీలలోకి వెళ్లలేదు. దీంతో ఈసారి కూడా ఆవే ఫలితాలు వస్తాయని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Next Story