నేడే మద్యం దుకాణాల కేటాయింపు

by velandi.Saikiran |

మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 27వ తేదీన సోమవారం

నేడే మద్యం దుకాణాల కేటాయింపు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 27వ తేదీన సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి నేతృత్వంలో లాటరీ తీసి, మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి రెండు యూనిట్లు ఉండగా, సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా గెజిట్ లో ప్రచురించిన దుకాణాల క్రమ సంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు.

206 షాపులు.. 11,231 దరఖాస్తులు..

జిల్లాను మల్కాజిగిరి, మేడ్చల్ రెండు యూనిట్లుగా విభజించారు. మేడ్చల్ యూనిట్ లో 118 షాపులకు గాను 5,168 దరఖాస్తులు రాగా, మల్కాజిగిరి యూనిట్ లో ఉన్న 88 షాపులకు 6,063 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 206 షాపులకు 11,231 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే దీనిని బట్టి చూస్తే తక్కువ మద్యం షాపులు కలిగి ఉన్న మల్కాజ్ గిరి జిల్లాలో ఎక్కువ దరఖాస్తులు, ఎక్కువ సంఖ్యలో మద్యం షాపులు కలిగి ఉన్న మేడ్చల్ జిల్లాకు తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరిలో ఒక్కో షాపుకు సగటున 69 దరఖాస్తులు రాగా, మేడ్చల్ యూనిట్ లో ఒక్కో వైన్స్ కు సగటున 44 దరఖాస్తులు వచ్చాయి.

పల్లవీ కన్వెన్షన్ లో డ్రా..

పీర్జాదిగూడలోని శ్రీ పల్లవీ కన్వెన్షన్ లో ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుందని అబ్కారీ శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకోవాలని సూచించారు. వైన్ షాపుల డ్రా కోసం వచ్చే వారు మొబైల్ ఫోన్ లను తమ వెంట హాలులోకి తీసుకురావద్దని సూచించారు.

Next Story