లాటరీలో గెలిచినా.. టెన్షన్ టెన్షన్

by velandi.Saikiran |   (  Updated:2025-11-12 20:17:29  IST  )

నూతన దుకాణాల కేటాయింపు ప్రక్రియకు ముందుగా ఉన్న దుకాణాల అంశంలో అక్కడే దుకాణాలు ఏర్పాటు చేస్తున్న విషయంలో

లాటరీలో గెలిచినా.. టెన్షన్ టెన్షన్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎంతో ఉత్సాహంతో పలువురు మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్నారు. నిర్ణీత రుసుమును చెల్లించి లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. వైన్ షాప్ తమకు వచ్చిదన్న సంతోషం ఒకవైపు పూర్తిగా తీరకముందే మద్యం దుకాణాల ఏర్పాటుకు వెళ్లువెత్తుతున్న అభ్యంతరాలతో కొత్తగా గెలుచుకున్న వైన్ షాప్ దుకాణదారులకు టెన్షన్ తప్పడం లేదు.

నూతన ప్రాంతాల్లో అభ్యంతరం..

నూతన దుకాణాల కేటాయింపు ప్రక్రియకు ముందుగా ఉన్న దుకాణాల అంశంలో అక్కడే దుకాణాలు ఏర్పాటు చేస్తున్న విషయంలో అభ్యంతరాలు రాకపోయినప్పటికీ కొంతమంది నూతన ప్రాంతంలో వైన్ షాపు ఏర్పాటు కోసం సముదాయాన్ని లీజుకు/అద్దెకు తీసుకొని వైన్‌షాప్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు అవుతున్న వైన్ షాపు విషయంపై స్థానికులు పలు ప్రాంతాలలో అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో కొత్త దుకాణాలు ఏర్పాటుకు విఘాతం కలుగుతుంది. కొంతమందికి పనులు ప్రారంభించక ముందే అభ్యంతరాలు వస్తుండగా మరికొందరికి సగం పనులు పూర్తయిన తర్వాత అభ్యంతరాలు తీవ్రస్థాయిలో ఉండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని లబ్ధిదారులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చేస్తున్న నిరసనలకు తోడుగా అక్కడ ఉన్న నాయకులు సైతం వారికి మద్దతు పలుకుతుండడంతో దుకాణ ఏర్పాటుదారులకు ఇబ్బందులు తప్పేటట్టు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన బాధితులు..

నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ నగర్‌లో సర్వే నంబర్ 133 ప్లాట్ నంబర్ 5 నుంచి 9లలో ఉన్న స్థలంలో ఓ వ్యక్తి మద్యం దుకాణం ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఈ విషయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి సైతం నిరసన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సదరు ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నారని తెలిసింది. ఆ నిర్మాణాన్ని ఆపాలని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం సైతం స్థానికులు ఫిర్యాదు చేశారు.

జనావాసాల మధ్య.. తప్పని తిప్పలు..

మద్యం షాపుల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు రావడం ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయమే మీ కాదు. ప్రతిసారి వైన్ షాపుల ఏర్పాటు చేస్తున్న సందర్భంలో స్థానికుల నుంచి ఏదో తీరుగా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, వివిధ కాలనీల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వైన్ షాపు ఏర్పాటు విషయంపై అభ్యంతరాలు వస్తాయి. మహిళలు, విద్యార్థినిలు, చిన్నపిల్లలు రాకపోకలు సాగించే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఈ అభ్యంతరాలు తెరమీదకు వస్తున్నాయనేది వాస్తవం. వైన్ షాపుతో ఇబ్బందులు తలెత్తటానికి ప్రధాన కారణం నిర్వాహకుల తీరే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు బహిరంగంగా మద్యం సేవిస్తూ న్యూసెన్స్ చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించకపోగా, అక్కడే తాగుతున్న అభ్యంతరం చెప్పకపోవడం కూడా ప్రధాన తప్పు అని ఆరోపిస్తున్నారు. పేరుకే సిట్టింగ్ అనుమతులు తీసుకున్న మద్యం దుకాణానికి అటు ఇటు వంద మీటర్ల దూరంలో బహిరంగగానే మద్యం సేవిస్తున్న దృశ్యాలు సాధారణంగానే కనిపిస్తూ ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

పోలీసు ఎక్సైజ్ శాఖలు ఏం చేస్తున్నట్టు..?

మద్యం దుకాణాల వద్ద బహిరంగ మద్యం సేవించడంపై కఠిన చర్యలు తీసుకుంటే స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. బహిరంగ మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో వైన్ షాపు ఏర్పాటు చేసే అంశంపై స్థానికంగా అభ్యంతరాలు వస్తున్నాయని తెలిసింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా స్థానికులకు భరోసా కల్పిస్తే అభ్యంతరాలకు స్వస్తి పలికే అవకాశం మొండుగా ఉంది.

Next Story