దిశ కథనంతో కదులుతున్న అక్రమార్కుల డొంక

by Yella Dhawani Reddy |

మేనేజ్ ​చేస్తారని నమ్ముకుని మోసపోయామని భవన నిర్మాణదారులు తలలు పట్టుకుంటున్నారు.

దిశ కథనంతో కదులుతున్న అక్రమార్కుల డొంక
X

దిశ, కూకట్‌పల్లి: మేనేజ్ ​చేస్తారని నమ్ముకుని మోసపోయామని భవన నిర్మాణదారులు తలలు పట్టుకుంటున్నారు. కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్, కూకట్‌పల్లి జంట సర్కిళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేస్తుండటంతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతులకు మించి డీవియేషన్ చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల పరిస్థితి నేడు గందరగోళంగా మారింది. నిర్మాణాలు చేపట్టే వారి నుంచి స్థానికంగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు రూ.10లక్షల నుంచి రూ.30 లక్షల వరకు దండుకుని కిందిస్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు అందరిని మేనేజ్ చేస్తాం, అన్ని మేము చూసుకుంటాం అంటూ అభయ హస్తం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బిల్డర్లు, నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొక్కి వంద శాతం డీవియేషన్‌తో నిర్మాణాలు చేపడుతు జీహెచ్‌ఎంసీ అధికారులకు తలనొప్పిగా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణదారుల తీరు మారకపోవడంతో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న భవనాలను 60కి పైగా సీజ్ చేశారు.

క్రిమినల్ కేసులు నమోదు..

కూకట్‌పల్లి, మూసాపేట్ ​జంట సర్కిళ్ల పరిధిలో గత 6 నెలలుగా సీజ్ చేసిన భవనాలను కొంత మంది నిర్మాణదారులు రాజకీయ నాయకుల మాటలు విని సీజ్ తొలగించడం, సీజ్ చేసి ఉన్న లోలోపల నిర్మాణ పనులు చేపట్టడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో అధికారులు నిర్మాణదారులు, బిల్డర్లపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

కదులుతున్న డొంక..

దిశ దిన పత్రికలో వరుసగా ప్రచురితం అవుతున్న కథనాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ తొలగించి నిర్మాణ పనులు చేపడుతున్న వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నారని తెలిసింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు రంగం సిద్ధం అవుతుండటంతో నిర్మాణదారులు, బిల్డర్లు తాము మేనేజ్ చేయడానికి డబ్బులు సమర్పించుకున్న వారి చుట్టు చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. అన్ని మేనేజ్ చేస్తామంటే డబ్బులు ఇచ్చాము ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని పలువురు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారు తలలు బాదుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. ఒక్కో నిర్మాణాన్ని మేనేజ్ చేసేందుకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, నిర్మాణం చేస్తున్న స్థలం, డివియేషన్ పై డిపెండ్ అయి ఉంటుందని సమాచారం.

Next Story