- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jathara: చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించాలి: మంత్రి దామోదర
మేడారం జాతరలో 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు (Sammakka Saralamma Jathara) వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha) ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారని ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి.. అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
50 పడకల ప్రధాన హాస్పిటల్
జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో, ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి సూచించారు. ఇందుకోసం 42 ఎన్-రూట్ (En-route) మెడికల్ క్యాంపులను ఏర్పాట్ చేశారు. షిప్టుల వారీగా 24 గంటల పాటు వైద్య సేవలతో పాటు ఎమర్జెన్సీ కోసం 35 అంబులెన్స్ లు, 248 రకాల మందులు సర్జికల్ సామాగ్రిని సిద్ధం చేశామని తెలిపారు.






