మేడారం బాధ్యత కాదు.. భావోద్వేగం: ఎమోషనల్ అయిన CM రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

మేడారం బాధ్యత కాదు.. భావోద్వేగం: ఎమోషనల్ అయిన CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం (Medaram)లో నిర్మించ తలపెట్టిన ఆలయ నిర్మాణం బాధ్యత మాత్రమే కాదని.. ఓ భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమోషనల్ అయ్యారు. ఇవాళ మేడారం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆనాటి పాలకులు సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని ఆరోపించారు. అమ్మవార్ల ఆశీస్సులతో నాడు ఇక్కడి నుంచే తాను పాదయాత్ర మొదలుపెట్టానని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని కామెంట్ చేశారు. ఇటీవలే ఐటీడీఏ (ITDA) ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మేడారం జారతపై కేంద్రం వివక్ష..

సమ్మక్క-సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కతో పాటు తన జన్మ ధన్యమైనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని.. అందుకే సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామని క్లారిటీ ఇచ్చారు. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని అన్నారు. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే అనుకున్న కార్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మహా జాతరకు తాను మళ్లీ వస్తానని.. ఈసారి మేడారం జాతరను కన్నుల పండుగగా జరుపుకుందామని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళా (Kumbha Mela)కు రూ.వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసీ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపును ఇచ్చి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story