- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుందర క్షేత్రంగా మేడారం.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. ఆ తల్లుల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. దేశవిదేశాల నుంచి వచ్చే వారి కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. దీంతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే జాతరకు రూ.కోట్ల నిధులు కుమ్మరించడం ఆ తర్వాత అవి కొన్నాళ్లకు పాడవటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై ఇలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం అధికారులు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తర్వాత పనులు ప్రారంభంకానున్నట్లు చెబుతున్నారు. వచ్చే జనవరిలో జరిగే జాతర నాటికి శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పలుమార్లు సమీక్షించారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులకు శ్రీకారం చుట్టేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు. అక్కడే మాస్టర్‌ప్లాన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.150 కోట్లు మంజూరు చేసింది.
టూరిజం సర్క్యూట్ అభివృద్ధి
మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి అనే విధానం ఒకప్పుడు ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో పెద్దఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం సెలవు దినాల్లో పదివేలు, సాధారణ రోజుల్లో మూడు వేలకు తగ్గకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రామప్ప, లక్నవరం, మేడారం ఇలా మూడు ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు. గతంలో మహా జాతరకు కేవలం నెల, రెండు నెలలకు ముందే ప్రభుత్వం పనులు చేపట్టడంతో నాణ్యత ప్రమాణాలు లోపించి కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిసేది. కానీ మాస్టార్ ప్లాన్ తో ఆ తీరు మారనుంది. శాశ్వత పనులకు అవసరమైన భూమిని సేకరించాలని నిర్ణయించారు.
మహా జాతర తేదీలివే..
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహాజాతర జరగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరగా, జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్దఎత్తున మొక్కులు చెల్లించుకోగా, జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో మహోత్సవం ముగియనుంది. సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండువగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు, గిరిజనేతరులు వస్తుంటారు.
29 ఎకరాల్లో స్మృతివనం
మేడారం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు సిద్ధం చేశారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు. జంపన్నవాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్ డ్యామ్ లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. జంపన్నవాగుతో పాటు స్మృతివనాన్ని 29 ఎకరాల్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు.
ఎక్కడ.. ఏయే పనులు?
మహాజాతర విజయవంతం చేయడంలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణ చాలా కీలకం. అందుకోసం రూ.14.50 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. భూపాలపల్లి, హనుమకొండ, కాటారం, ఏటూరునాగారం నుంచి మేడారం వెళ్లే మార్గాలన్నింటిలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ప్రధాన రహదారుల విస్తరణకు ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.9.95 కోట్లు, మేడారంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రధాన, అంతర్గత మార్గాల విస్తరణకు పంచాయతీరాజ్ శాఖకు రూ.51.30 కోట్లు కేటాయించారు. డైరెక్ట్ పంపింగ్ ద్వారా శుద్ధ జలాలు అందించడం, నీరు వృథా కావడంతో చాలా చోట్ల పరిసరాలు బురదమయంగా మారుతున్నాయి. ఈసారి ట్యాంకుల ద్వారా నీటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం రూ.ఐదు కోట్లు మంజూరు చేశారు. వ్యర్థాల సేకరణకు వందల సంఖ్యలో యంత్రాలు, వేల సంఖ్యలో కూలీలు, పనిముట్లు, రసాయనాలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. జాతరను ఏకో ఫ్రెండ్లీ తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జిల్లా పంచాయతీ అధికారికి రూ.11.62 కోట్లు కేటాయించారు. అగ్నిమాపక, గిరిజన సంక్షేమం, మత్స్య, సమాచార, పశుసంవర్థక, వైద్యశాఖ, అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, ఎన్పీడీసీఎల్, ఆబ్కారీ, ఆర్టీసీలకు రూ.33.01 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆయా శాఖలు తమ పరిధిలోని పనులను చేపట్టనున్నాయి. జంపన్నవాగు పరిసర ప్రదేశాల్లో పచ్చదనం పెంచడం, విశ్రాంతి తీసుకునేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
మాస్టర్ ప్లాన్..
మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు ఇచ్చినట్లు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజుల్లోగా పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మాస్టర్ ప్లాన్‌పై పొంగులేటి సమీక్షించారు. లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు లభించేలా అంగుళం తేడా లేకుండా శాస్త్రోక్తంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం డిజైన్, ప్రహారీ, గద్దెలు తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో భక్తులకు క్యూలైన్ల కారణంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగ్గా లభించేది కాదని, మహాజాతర సమయంలో ఇది భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భక్తుల సౌకర్యం కోసం గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు.






