మున్సిపాలిటీ అభివృద్ధి ఏది..?

by Nallavelli.Anjaneyulu |

ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ బీఆర్ఎస్ మున్సిపల్ పాలకవర్గం పనులు చేపట్టడం లేదని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడగా పారదర్శకత కూడా లోపించిందని పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధి ఏది..?
X

దిశ, పటాన్ చెరు టౌన్ : ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ బీఆర్ఎస్ మున్సిపల్ పాలకవర్గం పనులు చేపట్టడం లేదని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడగా పారదర్శకత కూడా లోపించిందని పలు వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్లు రాఘవేంద్ర, సంపత్ రెడ్డి, సందీప్ గౌడ్, వెంకట్, నారాయణదాస్, కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవికుమార్ లు మాట్లాడారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ చేపడుతున్న పనుల్లో స్పష్టత కనబడడం లేదన్నారు. ఎప్పుడో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు కొందరు కాంట్రాక్టర్లు నేటి వరకు పూర్తి చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. డంప్ యార్డ్ ఏర్పాటు విషయంలో కలెక్టర్ టెండర్లను పిలవాలని సూచించినప్పటికీ, ఎలాంటి టెండర్ నిర్వహించకుండా రాత్రికి రాత్రే కాంట్రాక్టర్ కి ఎలా కట్ట పెడతారని ప్రశ్నించారు.


పారిశ్రామిక వాడగా పేరున్న ఇస్నాపూర్ లో పరిశ్రమలు ఎక్కువ ఉన్నందున సీఎస్ఆర్ నిధులు దారి మళ్లించకుండా, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కాలుష్యంతో నిండిన ఇస్నాపూర్ ప్రాంతంలో ప్రజలు బోర్ వేసుకున్నా కలుషితం నీరు తాగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 800కు పైగా పరిశ్రమలు ఉన్న ఇస్నాపూర్ లో 400కు పైగా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటికి ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటీసులు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పెరిగిన హౌస్ టాక్స్ లు చెల్లిస్తూ ప్రజలు భారాన్ని మోస్తున్నారని, మరి పరిశ్రమలకు ఎంతవరకు టాక్స్ ధరలు పెంచారో, వాటి వివరాలను వెల్లడించాలని కోరారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీ లే ఔట్లు హెచ్ఎండిఏ లేఔట్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా మున్సిపల్, రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేపట్టి, మున్సిపాలిటీ రెవెన్యూ ని పెంచాలని కోరారు. వార్డులకు కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో అభివృద్ధికి ఉపయోగించాలని, నిధులు మళ్లిస్తే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story