- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నిరుపేదలకు సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ స్పష్టం చేశారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : నిరుపేదలకు సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలో సర్వే జరుగుతుందని.. అతి త్వరలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించి తీరుతామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కమిటీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కేసులు తప్పవు : పీడీ చలపతిరావు
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు జరుగుతున్న సర్వే నేపథ్యంలో ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల పేరుతో ఇల్లు, స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ పీడీ చలపతిరావు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కొందరు వ్యక్తులు పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లలో తిరుగుతూ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్రమార్కులకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఈ సుజాత, ఏఈ లు పాల్గొన్నారు.






