- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి కాలుష్యం, వ్యాధుల బారిన ప్రజానీకం
జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం, గడ్డపోతారం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.

నీటి కాలుష్యం, వ్యాధుల బారిన ప్రజానీకం
= జిన్నారం, గుమ్మడిదల, బొల్లారంలలో ఆందోళనకర పరిస్థితులు
= పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
=* ఊరును విడువలేక ఉసూరు మంటూ జీవనం..
= భూగర్భ జలాలు, వాయు సర్వం కాలుష్యమయం
=* ప్రభుత్వం స్పందించాలని స్థానికుల డిమాండ్...
దిశ, జిన్నారం: జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం, గడ్డపోతారం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు ప్రశాంతంగా, ప్రకృతి వాతావరణంలో జీవించిన గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, దోమడుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు కాలుష్యపు నీడలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలు, గాలి, నేల అన్ని విషతుల్యంగా మారడంతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గడ్డపోతారం మున్సిపల్, బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక వాడలోని ఏగ్రామంలో చూసినా కాలుష్యంతో క్యాన్సర్, చర్మవ్యాధులు, కీళ్ళ నొప్పులు, మహిళల్లో ముందస్తు ఆభర్షను, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత వ్యాధులు ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారిపోయాయి.
* పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..
ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, బొల్లారం గ్రామాల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రారం లక్ష్మీ, మద్దూరి సుభాష్, మద్దూరి అంజమ్మలు లంగ్స్, నోటి, ఇతర క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దోమడుగు గ్రామంలో చింతల భూదేవమ్మతో పాటు గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో మరో నలుగురు క్యాన్సర్ బాధితులు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇంకా బయటకు చెప్పని రోగులు ఎంతో మంది ఉన్నారు. గతంలో అరుదుగా కనిపించిన ఈ వ్యాధులు ఇప్పుడు అనేక కుటుంబాలను కుదిపేస్తున్నాయి. వైద్యులు కూడా కాలుష్య ప్రభావం ఒక ముఖ్య కారణమంటున్నారు.
ఇక మూగ జీవాలు సైతం ఎన్నో మృత్యువాత పడుతున్నాయి. ఖాజీపల్లిలో గడిచిన సంవత్సరంలోనే చిరుమణి అభిమన్యు, ఆకుల హకీమ్ , పొలపాక వెంకటేష్, రమేష్, చిట్ల జగన్, శంకరయ్య, శ్రీను, పర్వేద రాజు, పంతులు రాజు, మన్నే నరేష్ లకు చెందిన గేదెలు కాలుష్య జలాలు సేవించి మృత్యువాత పడ్డాయి.ఆ మూగ జీవాల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుంది. ఇక గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగుకు చెందిన జంగా రమేష్, చందు, చింతల శ్రీధర్ బాబు, వెంకట్ రెడ్డి, రాళ్లకత్వ జగన్, వంజరి నాగరాజు ఇలా గ్రామంలోని చాలా మంది గేదెలు కాలుష్య జలాలు సేవించి మృతి చెందాయి. వీటి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఇలా కాలుష్య ప్రాంతాలలో రైతుల మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.
కాలుష్యమే... ప్రధాన సమస్య
గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం, బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక వాడలోని పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. దోమడుగు నల్లకుంట కుంట చెరువు నీళ్లు ఎర్రరంగులోకి వచ్చాయి. అక్కడ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గత అక్టోబర్ నుంచి గ్రామస్తులు నిరసన చేస్తూనే ఉన్నారు. ఇక్కడి ప్రాంతాలలో బోర్లు, బావుల నీరు తాగడానికి పనికిరాకుండా పోయింది. చాలా చోట్ల నీరు దుర్వాసన, నీటిని శుద్ధి చేసినా విషతుల్యం పోవడం లేదు. ఇలాంటి నీళ్లు తాగడం వల్ల చర్మ వ్యాధులు, కడుపు సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. గాలిలో విష వాసనలు రాత్రి సమయాల్లో ఎక్కువగా పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు గ్రామాలను కమ్మేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి.
గ్రామం విడిచి వెళ్లలేని బాధ
ఇంతటి సమస్యల మధ్య ప్రజలు తమ పూర్వీకుల భూమిని, ఇళ్లను వదిలి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. బతకలేని పరిస్థితి వదిలి వెళ్లలేని పరిస్థితి అంటూ గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి, ఆస్తులు, భావోద్వేగ అనుబంధం కారణంగా ఈ గ్రామాలను విడిచి వెళ్లడం వారికి సాధ్యం కావడం లేదు. కాలుష్యం ప్రభావం మనుషులకే కాకుండా పశువులపై కూడా తీవ్రంగా పడుతోంది. కలుషిత నీరు తాగడం వల్ల పశువులు అనారోగ్యానికి గురై మరణిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. రైతులకు ఇది మరో పెద్ద నష్టంగా మారింది.
* పీసీబీ అధికారులు నిర్లక్ష్యం
పర్యావరణ పరిరక్షణ బాధ్యత వహించే పిసిబి అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని, నియమాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
కాలుష్యం వదిలితే చర్యలు తప్పవు: పీసీబీ ఈ ఈ కుమార్ పాఠక్
పరిశ్రమలు కాలుష్య నియమాలు పాటిస్తున్నాయా లేదా అని తరచుగా తనిఖీలు చేస్తున్నామని, నీరు, గాలి నేలలో కలుషితం స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని పీసీబీ ఈఈ కుమార్ పాఠక్ తెలిపారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించే ముందు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని, పరిశ్రమలు ఈటీపీ, ఎస్టీపీ, గాలి కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయించామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యాలు నియమాలు ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అత్యధిక కాలుష్యం కలిగించే పరిశ్రమలను గతంలో శాశ్వతంగా మూసివేయించామని తెలిపారు. చెరువులు, గాలి నాణ్యతను. దరిమి చెరువు కాలుష్యం పై ప్రజలు ఫిర్యాదులు చేశారని, వెంటనే స్పందించి నమూనాలను సేకరించామని వెల్లడించారు.
కాలుష్యంతో రోగాలు: మధుకర్ (గుమ్మడిదల పీహెచ్ సీ డాక్టర్)
గుమ్మడిదల, బొంతపల్లి, అన్నారం, దోమడుగు ప్రాంతాలలో అధికంగా చర్మవ్యాధులు వస్తున్నాయని తెలిపారు. కాలుష్యపు నీరు సేవిస్తే రోగాల బారిన పడతారని స్వచ్ఛమైన నీరును మాత్రమే సేవించాలని సూచించారు. పీహెచ్ సి పరిధిలో ఐదు క్యాన్సర్ కేసులు ఉన్నాయని తెలిపారు. కాలుష్యంతో లంగ్స్, నోటి, తదితర క్యాన్సర్ రోగాలు వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే గ్రామాలలో ఏఎన్ఏం లచేత ఎప్పటికీ ఎప్పుడూ రిపోర్టులు తీసుకొని తగు వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఇలా చేస్తే కొంతవరకు పరిష్కారం లభిస్తుంది
ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి, కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య జలాలను పూర్తిగా శుద్ధి చేసే విధానం అమలు చేయాలని, ప్రభావిత గ్రామాలలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ పెట్టి అక్కడి ప్రజల రక్త, తేమడ, తదితర పరీక్షలు నిర్వహించాలని, శుద్ధమైన తాగునీరు అందించి అవసరమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చని అంటున్నారు.






