- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెక్ పోస్ట్ ఎత్తివేతతో బ్రేకుల్లేని రవాణా
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వ్యాపార వాణిజ్యాలను సులభతరం.. రవాణాలో జాప్యాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ పర్మిట్ల జారీ..

దిశ, జహీరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వ్యాపార వాణిజ్యాలను సులభతరం చేయడం, రవాణాలో జాప్యాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ పర్మిట్ల జారీని ప్రవేశపెట్టిన ప్రభుత్వం సరిహద్దు చెక్ పోస్ట్‌లను ఎత్తివేసింది. ఇది నాణానికి ఒకవైపయితే మరోవైపు చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న ఆ శాఖ అధికారుల అక్రమార్జనకు చెక్ పెట్టడ మే ప్రధాన లక్ష్యమని ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో పెద్ద మొత్తంలో వెలుగు చూసిన సంపాదన బట్టి స్పష్టమవుతోంది. లోగడ చెక్ పోస్ట్ లో పనిచేసిన మరికొంత మంది అధికారులపై దాడులకు ఏసీబీ యత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. చెక్ పోస్టులు ఎత్తివేయడంతో సరిహద్దుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తప్పింది. దీంతో వాహనాల రద్దీ తగ్గి, రవాణా అత్యంత వేగంగా సాగిపోతోంది. నిబంధనల సాకుతో వాహనాలను ఆపే వారు లేకపోవడంతో డ్రైవర్లు 'రయ్ రయ్' మంటూ జాతీయ రహదారిపై వేలాది వాహనాలు దూసుకుపోతున్నారు.
నియంత్రణకు బ్రేక్..
వ్యాపార ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను ఎత్తివేసింది. ఇందులో భాగంగా తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో జాతీయ రహదారి 65 పై మాడ్గి వద్ద గల చెక్ పోస్ట్ ను కూడా ఎత్తివేశారు. అయితే, ఈ నిర్ణయం ఒకవైపు వ్యాపారులకు ఊరటనిస్తుంటే, మరోవైపు అక్రమ రవాణాకు రాచబాటలు వేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డుకునే నాథుడు లేకపోవడంతో ఓవర్ లోడ్ వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న రవాణాను అదుపు చేసే యంత్రాంగం కరువైంది. గతంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే వ్యవస్థ ఉండేది.
ఇప్పుడు ఆ వ్యవస్థ అదృశ్యం కావడం తో చెక్ పోస్టుల్లో సీన్ రివర్స్? మద్యం, గంజాయి ఇతర నిషేధిత వస్తువుల రవాణా పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా అక్రమ రవాణాకు చాన్స్ ఇచ్చినట్లైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ఖజానాకు గండి పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పన్ను ఎగవేత దారులు ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. నిరంతరం సరిహద్దుల్లో తనిఖీలు ఉండడంతో నేరస్థుల కదలికలపై నిఘా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకుండా పోయాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో నేరస్థుల కదలికలను కనిపెట్టడం కష్టతరంగా మారుతుంది.
ఈ 'స్పీడ్'కు చెక్ పెట్టాలి..
వ్యాపారాల సులభతరం కోసం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ, తనిఖీలు లేని ప్రయాణం రాష్ట్ర భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారేలా కనిపిస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఈ 'స్పీడ్'కు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దులో చెక్ పోస్టుల భౌతిక ఉనికిని తొలగించినప్పుడు, ఎత్తి వేసిన ప్రాంతాల్లో స్మార్ట్ సర్వెలెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు, ఈ-వే బిల్లుల ఆటోమేటిక్ వెరిఫికేషన్, ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) స్కానర్లు, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్ల ద్వారా వాహనాల కదలికలను గమనించాలి. కేవలం పోస్టులను ఎత్తివేసి చేతులు దులుపుకుంటే, అది అక్రమార్కులకు రాజమార్గం వేసినట్లవుతుందే కానీ ఆశించిన ఫలితం దక్కదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవినీతిని నిర్మూలించడం ఎంత ముఖ్యమో, రాష్ట్ర భద్రత, ఆదాయాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమంటున్నారు.






