అనాదిగా ఆక్రమణల పర్వం.. స్థానికులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు

by Ajay Maddhiboyina |

సంగారెడ్డి జిల్లాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం జహీరాబాద్. అభివృద్ధికి సమాంతరంగా ట్రాఫిక్, ఆ రహదారుల ఆక్రమణల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. పట్టణంలో ఏ ప్రధాన రహదారి చూసినా, ఏ గల్లీ చూసినా ట్రాఫిక్ కష్టాలు, దురాక్రమణలు తప్పడం లేదు.

అనాదిగా ఆక్రమణల పర్వం.. స్థానికులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం జహీరాబాద్. అభివృద్ధికి సమాంతరంగా ట్రాఫిక్, ఆ రహదారుల ఆక్రమణల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. పట్టణంలో ఏ ప్రధాన రహదారి చూసినా, ఏ గల్లీ చూసినా ట్రాఫిక్ కష్టాలు, దురాక్రమణలు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం రోడ్లపై అడ్డగోలుగా జరుగుతున్న వ్యాపారాలే. దీనికి అధికారుల అవినీతి, నేతల ఉదాసీనత తోడవడంతో ఈ సమస్య పెరిగిపోతోంది.

ట్రాఫిక్ జాంకు ప్రధాన కారణం...

జహీరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు మూల కారణం వ్యాపారులేనన్నది నిర్వివాదాంశం. భవాని మందిర్, హనుమాన్ మందిర్ రోడ్లు వ్యాపారుల అక్రమ నిర్మాణాలతో కూచించుకుపోయాయి. 60 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ రోడ్లు ప్రస్తుతం 20ఫీట్లకు చేరాయి. సుమారు 40 ఫీట్లు ఆక్రమణకు గురయ్యాయి. దేనికి తోడు వ్యాపారస్తులు సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించి రహదారిపై తమ సరుకులు విచ్చలవిడిగా పెట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్టు తమ వ్యాపార సంస్థ ముందున్న రహదారి ప్రాంతంలో చిల్లర వ్యాపారులకు దినసరి అద్దెపై లీసజుకిచ్చే గలీజ్ ఆచారానికి తెర తీశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దురాచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మే తోపుడు బండ్లు రోడ్ల మీద అడ్డంగా పెట్టి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా, దుకాణాల యజమానులు కూడా తమ వస్తువులను షాపుల ముందు, రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆక్రమించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. ఫలితంగా పట్టణంలో తరచూ ట్రాఫిక్ జామ్ తో అటూ ఇటూ వెళ్లాలంటే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోని భయాందోళనకు గురవుతున్నారు.

ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్..

ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, పాదచారులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం ఏదో ఒక చోట చిన్నపాటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజలు కూడా తమ వాహనాలను రోడ్ల మీదనే పార్క్ చేయడంతో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ పోలీసులు రోజుకు ఒకవైపు వాహనాలు ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పటికీ సమస్య పోవడం లేదు ప్రమాదాలు తగ్గడం లేదు. ఆక్రమణల తొలగింపు తోనే సమస్యకు పరిష్కారమన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతుంది.

సమస్య పరిష్కారానికి చర్యలు..

ఈ సమస్యలను పరిష్కరించేందుకు జహీరాబాద్ పోలీసు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక సీఐ , ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా, రోడ్లపై అడ్డంగా ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తొలగించే కార్యక్రమాన్ని లోగడ ప్రారంభించారు. భవానీ మందిర్ క్రాస్ రోడ్స్ నుంచి జహీరాబాద్ బస్టాండ్ వరకు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు, కూరగాయల బండ్లు, ఇతర ఆక్రమణలను తొలగించారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ తొలగింపు పరిపూర్ణం కాలేదు. నేతల జోక్యం వల్లే ఇది అసంపూర్ణంగా మిగిలిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు , దుకాణాల యజమానులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ జామ్, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప హెచ్చరించారు.

దత్తగిరి కాలనీలో ఆక్రమణలు తొలగింపు

జహీరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గించేందుకు దత్తగిరి కాలనీలో రోడ్డుపై ఆక్రమణలు తొలగింపునకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా తీసుకున్న చర్యలు స్థానికుల ప్రశంసలందుకుంటున్నాయి. ఈ చర్యలు పట్టణంలోని ప్రధాన రోడ్లలో కూడా చేపట్టవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు అందరూ సహకరిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తం అవుతోంది.

Next Story