అక్రమాలపై వెలుస్తున్న త్రిదశ.. ఆరేళ్లుగా మొదలు కాని నిర్మాణ పనులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-19 02:49:11  IST  )

సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని కందిలో జాతీయ రహదారి పక్కన నిర్మాణం కాబోతున్న "త్రిదశ" చుట్టూ వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. 8.20 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న వెంచర్ లో చెరువు శిఖం భూమి ఉండగా, రోడ్డు పక్కన పైప్ లైన్ కోసం వదిలిన దాదాపు 2 వేల గజాల స్థలంలో సంస్థ ఆఫీసు నిర్మాణ పనులు చేపడుతున్నారు.

అక్రమాలపై వెలుస్తున్న  త్రిదశ.. ఆరేళ్లుగా మొదలు కాని నిర్మాణ పనులు
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని కందిలో జాతీయ రహదారి పక్కన నిర్మాణం కాబోతున్న "త్రిదశ" చుట్టూ వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. 8.20 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న వెంచర్ లో చెరువు శిఖం భూమి ఉండగా, రోడ్డు పక్కన పైప్ లైన్ కోసం వదిలిన దాదాపు 2 వేల గజాల స్థలంలో సంస్థ ఆఫీసు నిర్మాణ పనులు చేపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు రిటైర్డ్ సమయంలో అక్రమంగా ఎన్ ఓసీ లు వచ్చేలా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ త్రిదశ వ్యవహారంలో ఇంకా ఎన్నో అక్రమాలు ఉన్నాయని అవి ఒక్కొకటిగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

450 మంది..రూ.12 లక్షల చొప్పున

దాదాపుగా ఆరేళ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి చెందిన నలుగురు ఓ సొసైటీ ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ ద్వారా భూమి కొనుగోలు చేసుకుని అందరికీ ఇండ్లు నిర్మించుకోవాలనేది సొసైటీ లక్ష్యం. ఇందులో భాగంగానే సంగారెడ్డి పట్టణానికి చెందిన దాదాపు 450 మంది నుంచి ఆరేళ్ల క్రితమే ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షల వసూలు చేశారు. ఇలా రూ.54 కోట్ల వరకు వసూలు అయ్యాయి. అలా అప్పుడు వసూలు చేస్తే ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం ఊసే లేకపోవడంతో వైశ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇటీవలే పక్క రాష్టానికి చెందిన ఓ బిల్డర్ కు నిర్మాణ పనుల కోసం అప్పగించారు. ఆ రంగంలో కనీస అనుభవం లేని అతడికి ఇవ్వడం ద్వారా పనులు మధ్యలోనే వదిలేసి వెళతారని డబ్బులు కట్టిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. అంటే కాకుండా ఆ బిల్డర్ వచ్చి రావడంతోనే ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో కొత్త దందా మొదలు పెట్టారని చెబుతున్నారు. అక్రమాలు వెలుగులోకి వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

భూమి కొనుగోలు నుంచి నేటి వరకు అక్రమాలే...

సొసైటీ ఏర్పడిన తరువాత వసూలైన డబ్బుతో సంగారెడ్డి నుంచి పటాన్చెరు వెళ్లే జాతీయ రహదారి పక్కన, కంది హనుమాన్ టెంపుల సమీపంలోనే 8.20 గుంటలు భూమిని కొనుగోలు చేశారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం ఆ భూమిలో చెరువు శిఖం భూమి ఉంది. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే ఒకరిద్దరి అధికారులు రిటైర్మెంట్ కు ముందు చట్టవిరుద్ధంగా ఎన్ఓసీ తీసుకువచ్చారు. అధికారులు ఇప్పుడు విచారణ జరిపితే ఎన్ఓసీ అక్రమాలు బయటపడనున్నాయని తెలుస్తోంది. అంటే భూమి కొనుగోలు నుంచి అక్రమాలకు తెరతీసినట్లు అర్థం అవుతుంది.

పైప్ లైన్ రోడ్డులో ఆఫీసు నిర్మాణ పనులు

జాతీయ రహదారి పక్కనే ఈ స్థలం ఉండడంతో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే రోడ్డు పక్కనే సదరు "త్రిదశ" ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వెంచర్ భూమి మధ్యలో హెచ్ ఎండీఏ వాటర్ పైప్ లైన్ కు స్థలం వదిలారు. కాగా ఈ మధ్యే ఈ భూమిలో ఆఫీసు నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు 2 వేల గజాల స్థలంలో ఐరన్ బాడీతో బారీగా ఆఫీసు నిర్మాణ పనులు మొదలు కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఇలా నిర్మాణం జరుగుతుంటే కంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంచేస్తున్నట్లు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

Next Story