- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉధృతం అవుతున్న 'బుల్లెట్ ట్రైన్' దారి మళ్లింపు ఉద్యమం!
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్‌కు దారి మళ్లించడంపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, జహీరాబాద్: ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్‌కు దారి మళ్లించడంపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేపథ్యంలో స్థానికులు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జహీరాబాద్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ముందుగా నిర్ణయించిన రూట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా వాసులు, మేధావులు, రాజకీయ శ్రేణులు తమదైన రీతిలో ఉద్యమిస్తున్నారు. ఈ దారి మళ్లింపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగానే పలువురు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేస్తుండగా, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తించబడిన అనేక ప్రతిష్టాత్మక భారీ పరిశ్రమలు జహీరాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొలువై ఉన్నాయి. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, పిరమల్, ఎంఆర్ఎఫ్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇక్కడ విజయవంతంగా నడుస్తున్నాయి. ఇవి కాకుండా, ప్రతిష్టాత్మకంగా దాదాపు 12,600 ఎకరాల్లో ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్’ (నిమ్జ్), మరో 2 వేల ఎకరాల్లో ‘ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
రాష్ట్రానికే ఆర్థిక దిక్సూచి 'బుల్లెట్ ట్రైన్'
ఈ పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత రైతులు, ప్రజలు వేల ఎకరాల భూములను త్యాగం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడం ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలకే కాకుండా, యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఆర్థిక దిక్సూచిగా మారనుంది. ఇంతటి కీలకమైన పారిశ్రామిక రంగానికి రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. బుల్లెట్ ట్రైన్ వంటి హైస్పీడ్ కనెక్టివిటీ జహీరాబాద్‌కు రావడం వల్ల దేశ ఆర్థిక రాజధాని ముంబైతో వ్యాపార, పారిశ్రామిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. కావున పరిశ్రమల పురోగతికి ఎంతో కీలకమైన బుల్లెట్ ట్రైన్‌ను ఇక్కడి నుంచి దారి మళ్లించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, ముందుగా నిర్ణయించిన విధంగానే ముంబై నుంచి హైదరాబాద్ వయా జహీరాబాద్ మీదుగానే బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించాలని సంగారెడ్డి జిల్లా వాసులు, స్థానిక ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో వివిధ పార్టీల నాయకులు కిషన్ మహారాజ్, మోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, భాస్కర్, జగన్నాథ్, తదితరులు పాల్గొన్నారు.






