- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అన్నారు.

దిశ, ములుగు : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో భాగంగా మర్కుక్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం ఆనందదాయకమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మర్కుక్‌లో ప్రారంభించిన ఈ పాఠశాలకు ఇప్పటికే 683 దరఖాస్తులు అందగా, ప్రస్తుతానికి 520 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని, వారి అభ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.16.62 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో తరగతి గదులు, ఇతర సౌకర్యాలను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు విద్యాబోధన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతిలో రెండు సెక్షన్లు ఏర్పాటు చేయగా, ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థుల రవాణా సౌకర్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆటోల ద్వారా విద్యార్థుల రాకపోకలను నిర్వహిస్తుండగా, త్వరలో నాలుగు బస్సులను ఏర్పాటు చేసి గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి మల్లేష్, డీఈవో వరగంటి శ్రీనివాస్ శాస్త్రి, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో విక్రమ్, ఎంఈవో ఉదయ్ భాస్కర్ రెడ్డి,ఉప సర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ భాస్కర్, పాఠశాల ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.






